రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న వాటికి అదనంగా మరో 13 జిల్లాలు వచ్చి చేరనున్నాయి. మొత్తంగా 26 జిల్లాలు అందుబాటులోకి రానున్నాయి.
ఉగాది నుండే రాష్ట్రంలోని 26 కొత్త జిల్లాల నుండి పరిపాలన సాగనుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటించారు. 73వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. శకటాల ప్రదర్శనను తిలకించారు. ఈ వేడుకల్లో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేన్ రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. కొత్త జిల్లాలను ప్రస్తావించారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. గిరిజనుల కోసం రెండు జిల్లాలను రూపొందించామని పేర్కొన్నారు. ఉగాది నాటికి కొత్త జిల్లాలు మనుగడలోకి వస్తాయని స్పష్టంచేశారు. కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామనే విషయాన్ని అధికార పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచిందని బిశ్వభూషణ్ హరిచందన్ గుర్తు చేశారు.
అలాగే ఉద్యోగుల సంక్షేమం మా ప్రభుత్వ ప్రాధాన్యత. 11వ పీఆర్సీలో భాగం గా 23 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచింది. సంక్షేమ ఫలాలు పేద ప్రజలతో పాటు ఉద్యోగులకు చెందాల్సిన అవసరం ఉందని తెలిపారు.

