వాతావరణ మార్పుల వల్ల చిత్తూరు జిల్లాను డెంగీ, విషజ్వరాలు వణికిస్తున్నాయి. పల్లె నుంచీ పట్నం వరకూ జ్వరంతో బాధపడుతూ మంచం పడుతున్నారు. రెండు నెలల వ్యవధిలో దాదాపు 13 మంది మృత్యువాతపడ్డారు. అయితే వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు మాత్రం విషజ్వరాలు, డెంగీ ఉన్నమాట వాస్తవమేనని, అయితే డెంగీతో ఎవరూ చనిపోలేదంటూ బుకాయిస్తుండటం గమనార్హం. ఇదే అదనుగా ‘ డెంగీ ‘ని బూచిగా చూపుతూ ప్రైవేటు ఆసుపత్రులు రోగుల నుంచీ అందినకాడికీ దండుకుంటున్నారు. రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయాయంటూ హడలెత్తించి, ధనార్జనే ధ్యేయంగా ఐసియులో ఉంచి ట్రీట్‌మెంట్ ఇస్తుండటం గమనార్హం.
సాధారణంగా మనిషి రక్తంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల ప్లేట్‌లెట్లు (తెల్లరక్తకణాలు) ఉంటాయి. అనారోగ్యానికి గురైనప్పుడు ఇవి కొంతమేర తగ్గుతుంటాయి. సాధారణ జ్వరాల్లోనూ ఈ పరిస్థితి ఉంటుంది. డెంగీ బారిన పడితే మాత్రం బాగా తగ్గుముఖం పడతాయి. 20 వేల కంటే దిగువకు పడిపోయి.. మూత్రంలో రక్తం రావడం, జ్వరం ఎంతకీ తగ్గకపోవడం, శరీరంపై దద్దుర్లు, తీవ్ర తల నొప్పి, వాంతులు, విరేచనాలు వంటి లక్షణాలు కన్పించినప్పుడు మాత్రమే ఆందోళన చెందాల్సి ఉంటుంది. పైగా ఐసియులో ఉంచి రోజుకు రూ 3 వేల నుంచి 6 వేల వరకు అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటం శోచనీయం. ఇలా డెంగీని బూచిలా చూపుతూ ఒక్కో రోగి నుంచి రూ 30 వేల నుంచి లక్షకు పైగా వసూలు చేస్తుండటం గమనార్హం.