ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర 15వ ముఖ్యమంత్రిగా , తమిళనాడు రాష్ట్ర 13వ గవర్నర్ గా పనిచేసిన కొణిజేటి రోశయ్య గారు ఈరోజు మృతి చెందారు . ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోశయ్య గారంటే అందరూ అభిమానిస్తారు , ఆత్మీయుడుగా భావిస్తారు. ఆయన మొదట్లో ఎన్ .జి .రంగా ప్రభావంతో స్వతంత్ర పార్టీలో చేరారు . ఆ తరువాత జాతీయ కాంగ్రెస్ లో చేరారు . ఆయన చివరి వరకు క్రమశిక్షణ కలిగిన నాయకుడుగా ఆ పార్టీలో లోనే కొనసాగారు.
రోశయ్య గారిది ఎలాంటి రాజకీయ నేపథ్యం వున్న కుటుంబం కాదు . మధ్య తరగతి కుటుంబం నుంచి రాజకీయాల్లో అంచెలంచేలుగా ఎదిగి ఒదిగిన వ్యక్తిత్వం ఆయనది . ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా చాలా నిరాడంబరంగా ఉండేవారు . తొలి నాళ్లలో పరిచయస్తులను ఆయన ఎప్పుడూ మర్చిపోలేదు . పదవితో ఆయన ప్రవర్తనలో మార్పు రాలేదు . రాజకీయాల్లో ఉంటూ కూడా విలువలతో బతికిన ఆదర్శప్రాయులు రోశయ్య గారు.
1980 నుంచి రోశయ్య గారితో నాకు పరిచయం వుంది . నేను ఆంధ్ర జ్యోతి సంస్థలో పనిచేస్తున్నప్పుడు వారానికి ఒకసారి ఆఫీస్ కు వచ్చేవారు . ఆంధ్ర జ్యోతి కార్యాలయం సచివాలయం ఎదురుగా మేడ మీద ఉండేది . ఆంధ్ర జ్యోతి దిన పత్రిక బ్యూరో చీఫ్ గా ఐ . వెంకట రావు , రిపోర్టర్స్ గా దామోదర స్వామి , ఉడయవర్లు , రామానాయుడు ఉండేవారు . జ్యోతి చిత్ర సినిమా వార పత్రిక హైదరాబాద్ రిపోర్టర్ గా నేను ఉండేవాడిని . రోశయ్య గారు వచ్చి ఆంధ్ర జ్యోతి ఆఫీసులో గంటకు పైగా ఉండేవారు . మా అందరితో చాలా కలుపుగోలుగా మాట్లాడేవారు . ఇరానీ టీ తాగుతూ కబుర్లు చెప్పేవారు .
ఆ తరువాత ఆయన రవాణా శాఖ , హోమ్ శాఖ , ఆర్ధిక శాఖ మంత్రిగా వున్నప్పుడు ఆంధ్ర జ్యోతి కి వచ్చే తీరిక ఉండేది కాదు . అయినా అప్పుడప్పుడు ఫోన్ చేసి అందరితో మాట్లాడేవారు . అలా రోశయ్య గారితో ఏర్పడిన పరిచయం చివరి వరకు కొనసాగింది .
2009లో రోశయ్య గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సచివాలయానికి వెళ్లి అభినందనలు చెప్పాను . ఒకసారి జమున గారితో ఆయన్ని వారి ఇంట్లో కలిశాను . ముందు సచివాలయానికి రమ్మని చెప్పారు . అయితే ఆ తరువాత సెక్రటరీ ఫోన్ చేసి “సర్ ఇంటికి రమ్మన్నారు” అని చెప్పారు . అది కూడా రాత్రి 8.. 30 కు రమ్మన్నారు . మేము వెళ్లిన కాసేపటికే అందరినీ పంపించి మమ్మల్ని ఇంట్లోని హాల్లోకి పిలిచారు . నేను , జమున , రమణ రావు గారు వెళ్ళాము . అప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధికి రోశయ్య గారికి ఒక చెక్ ఇచ్చారు .
తరువాత నా వైపు తిరిగి ” భగీరథ చెప్పు ఏమి కావాలి ? ” అని అడిగారు .
” నాకేమి వద్దు వద్దు జమున గారికి ఎన్ .టి ఆర్ అవార్డు ఇప్పించండి , మీరు ముఖ్యమంత్రిగా వున్నప్పుడే అది సాధ్యం ” అని చెప్పాను .
“ఇంతవరకు జమున గారికి ప్రభుత్వం తరుపున అవార్డు రాలేదా ? ” అన్నారు .
‘కనీసం రఘుపతి వెంకయ్య అవార్డు కూడా రాలేదు ” అని చెప్పాను .
“ఐ సీ . నేను గుర్తు పెట్టుకుంటా ” అన్నారు . తరువాత “వస్తాం ‘ అని బయలుదేరుతుంటే “భగీరథ నువ్వుండు ” అన్నారు .
జమున , రమణ రావు గారు బయటకు వెళ్లగానే ” నీ కోసం ఏదైనా చేయించుకో ” అన్నారు భుజం మీద చేయి వేసి .
రోశయ్య గారి నుంచి అలాంటి మాట వస్తుందని నేను ఊహించలేదు .
“నాకేం వద్దు సర్ , జమున గారికి చెయ్యండి చాలు ” అన్నాను .
నా వైపు అలా చూసి నవ్వారు .
ఆ తరువాత పది రోజులకే ప్రభుత్వం జమున గారికి ఎన్ .టి .ఆర్ అవార్డు ను ప్రకటించింది .
2015 మే లో ఆయన తమిళనాడు గవర్నర్ గా వున్నప్పుడు ఒకసారి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి . “మీతో మాట్లాడాలి , చెన్నై ఎప్పుడు రమ్మంటారు ?” అని అడిగాను .
“పనేమిటో చెప్ప? ” అన్నారు .
‘నా కవితా సంపుటి అక్షరాంజలి ని మీతో ఆవిష్కరించాలని , దాని గురించి మాట్లాడాలి ” అన్నాను .
“దాని గురించి నువ్వు చెన్నయ్ వద్దు ,బుక్ రిలీజ్ ఎప్పుడు పెట్టుకుంటున్నావ్ ?” అని అడిగారు .
” మీరు ఎప్పుడు డేట్ ఇస్తే అప్పుడు ప్రసాద్ ల్యాబ్ థియేటర్లో ఏర్పాటు చేస్తా ” అని చెప్పాను .
“అయితే రెండు మూడు రోజుల్లో నీకు ఫోన్ చేయిస్తా “అని చెప్పారు .
సరిగా రెండు రోజుల తరువాత సింగ్ ఫోన్ చేసి జూన్ 1వ తేదీన బుక్ రిలీజ్ పెట్టుకోండి అని చెప్పారు .
1980 జూన్ 1వ తేదీన నా మొదటి కవితా సంపుటి మానవతకు మహాకని శ్రీశ్రీ ముందు మాట వ్రాసి ఆవిష్కరించారు .
35 సంవత్సరాల తరువాత మళ్ళీ అదే రోజు చెన్నయ్ నుంచి గవర్నర్ హోదాలో వచ్చి నా అక్షరాంజలి ని రోశయ్య గారు ఆవిష్కరించారు . “జర్నలిస్టు భగీరథ నాకు చాలాకాలం నుంచి ఆత్మీయుడు , మంచివాడు , ఆయన కోసం నేను చెన్నయ్ నుంచి వచ్చాను “అని చెప్పారు .
తరువాత మిత్రుడు బ్రెయిన్ ఫీడ్ సంపాదకుడు కాకాని బ్రహ్మం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పిలవడానికి వెళ్ళాము . మాతో చాలా ఆత్మీయంగా మాట్లాడి ఆ కార్యక్రమానికి వచ్చి రెండు గంటలు వున్నారు . అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఫోటోలకు సహకరించారు .
క్రింద స్థాయి నుంచి జీవితాన్ని చూసిన రోశయ్య గారు ఏ పదవిలో వున్నా .. తొలి నాటి మిత్రులను , జర్నలిస్టులను , రాజకీయ నాయకులను మర్చిపోలేదు , మారిపోలేదు . అందరినీ పేరుతో ఆప్యాయంగా మాట్లాడించేవారు . అదే ఆయన ప్రత్యేకత. , అరుదైన వ్యక్తిత్వం . రోశయ్య గారి స్మృతి ఎప్పటికీ చిరస్మరణీయంగానే ఉంటుంది .
– భగీరథ
బాలకృష్ణ వ్యాఖ్యలపై ఇప్పుడు స్పందించను : మంత్రి తలసాని