నందమూరి తారక రామారావు గారు తొలిసారిగా వెండి తెరపై కనిపించిన మొట్ట మొదటి చిత్రం శోభనాచల స్టూడియో వారి ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ “మనదేశం” సినిమా 24 -11 -1949 తేదీ విడుదల. నిర్మాత సి.కృష్ణవేణి గారు శోభనాచల స్టూడియో వారి ఎం.ఆర్.ఏ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకులు ఎల్.వి.ప్రసాద్ గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలు: సముద్రాల రాఘవాచార్య, సంగీతం: ఘంటసాల, సినిమాటోగ్రఫీ: ఎం.ఏ.రహిమాన్, కళ: టి.వి.ఎస్.శర్మ, నృత్యం: వెంపటి సత్యం, ఎడిటింగ్: ఎం.వి.రాజన్ సమకూర్చారు.
ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, నాగయ్య, సి.హెచ్. నారాయణరావు, కృష్ణవేణి, రేలంగి, వంగర, రామనాథశాస్త్రి, రామమూర్తి, సురభి బాలసరస్వతి, ఎస్.వి.రంగారావు, తాతినేని ప్రకాశరావు, లక్ష్మీకాంతం తదితరులు నటించారు.
మధుర గాయకులు ఘంటసాల గారి స్వరకల్పనలో వచ్చిన పాటలు
“జయ జననీ భరత పావనీ,జయ జయ భారత జననీ”
“ఓహో భారతయువక కదలరా,నవ యువ
భారత విధాయ”
“అత్తలేని కోడలు ఉత్తమురాలు ఓయమ్మో”
“మరవలేనురా,పంచదార వంటి పోలీసెంకటస్వామి”
“వెడలిపో! వెడలిపో! తెల్ల దొర మాదేశం ఎల్ల దాటి ”
వంతు పాటలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
ప్రముఖ బెంగాలీ రచయిత శరత్ చంద్ర ఛటోపాధ్యాయ గారు రచించిన “విప్రదాస్” అనే బెంగాలీ నవల ఆధారంగా భారత స్వాతంత్ర్య సంగ్రామ నేపథ్యంలో యమ్.ఆర్.ఎ. ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా ప్రసిద్ధ నటీమణి సి.కృష్ణవేణి, మీర్జాపురం రాజా వారు నిర్మాతలుగా ప్రముఖ దర్శకులు ఎల్.వి. ప్రసాద్ గారి దర్శకత్వంలో “మనదేశం” చిత్రాన్ని నిర్మించారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఎన్.టి. రామారావు గారు తొలిసారిగా తెలుగుతెరకు ఈ చిత్రం ద్వారా పరిచయయ్యారు. అలాగే మధుర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు మొట్టమొదటిసారిగా ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడు ఆయ్యారు.
ఈ చిత్రం ఆనాటి స్వాతంత్ర ఉద్యమానికి స్ఫూర్తి గా నిర్మిచటం జరిగింది. ఆనాడు ఈ చిత్రాన్నికి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైన ఎన్టీఆర్ గారికి మంచి గుర్తింపు లభించి కళామతల్లి సేవలో 300 చిత్రాలకు పైగా నటించి ప్రేక్షకుల మన్నలను పొంది విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు అయ్యారు…..