telugu navyamedia
సినిమా వార్తలు

64 సంవత్సరాల “సీతారామ కళ్యాణం”

నందమూరి తారకరామారావు గారు స్వీయ దర్శకత్వంలో అనితరసాధ్యమైన “రావణబ్రహ్మ” పాత్రలో నటిస్తూ నిర్మించిన చిత్రం “సీతారామ కళ్యాణం” 06-01-1961 విడుదలయ్యింది.

ఎన్టీఆర్ గారి సోదరులు నందమూరి తివిక్రమరావు గారు నిర్మాత గా నేషనల్ ఆర్ట్స్ థియేటర్స్ (ఎన్.ఏ.టి) బ్యానర్ పై మొట్టమొదటిసారిగా ఎన్.టి.రామారావు గారి దర్శకత్వం లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే: ఎన్.టి.రామారావు, మాటలు, పద్యాలు, పాటలు: సముద్రాల రాఘవాచార్య (సీనియర్), సంగీతం: గాలి పెంచల నరసింహారావు, ఫోటోగ్రఫీ: రవికాంత్ నగాయిచ్, నృత్యం: వెంపటి సత్యం, కళ: టి.వి.ఎస్.శర్మ, ఎడిటింగ్: ఎస్.పి.ఎస్. వీరప్ప, అందించారు.

ఈ చిత్రం లోఎన్.టి. రామారావు, బి.సరోజాదేవి, హరనాథ్, గీతాంజలి, నాగయ్య, గుమ్మడి, కాంతారావు, మిక్కిలినేని, శోభన్ బాబు, కె.వి.ఎస్.శర్మ,మిక్కిలినేని, కొమ్మినేని శేషగిరిరావు, ఆర్జ జనార్ధనరావు, కస్తూరి శివరావు, ఛాయాదేవి, స్వర్ణ , కుచలకుమారి, అనూరాధ,కౌసల్య, మహంకాళి వెంకయ్య, మల్లాది, తదితరులు నటించారు.

సంగీత దర్శకుడు గాలి పెంచల నరసింహారావు గారి స్వరకల్పన లో పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.
“దేవ దేవ పరంధామ నీల మేఘ శ్యామా”
“కానరార కైలాస నివాస బాలేందు ధరా జటాధరా హర”
“జయత్వద భ్రవిభ్రమ భ్రమ ద్బుజంగ”(రావణాష్టకం)
“శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండీ”
వంటి సంగీత బాణీలు నేటికీ శ్రోతలను అలరిస్తూ ఉన్నాయి.

ఇందులోని ప్రతి పాట, ప్రతి పద్యం తెలుగుతనం తొణికిస లాడుతూ ఉంటుంది. ప్రముఖంగా “శ్రీసీతారాముల కళ్యాణం చూతము రారండి” వంటి శ్రావ్యమైన పాట ఇప్పటికీ ప్రతి ఇళ్ళలో, పెళ్ళిళ్ళల్లో, శ్రీరామనవమి పందిళ్ల లో తెలుగు రాష్ట్రాలలో ఎక్కడో ఒకచోట వినిపిస్తూ ఉంటాయి.

భూకైలాస్(1958) చిత్రం తర్వాత పూర్తి స్థాయిలో రావణాసురుడి పాత్రను పోషించాలనే తపనతో ఎన్టీఆర్ గారు రామాయణాన్ని కి సంబంధించిన ఎన్నో గ్రంథాలను శోధించి, ప్రతినాయకునిగా అసమాన నటన ప్రదర్శించి, ఆ పాత్రకు వన్నె తెచ్చి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.

ఈ చిత్రంలో రావణ పాత్రలో ఎన్.టి.రామారావు గారి అభినయాన్ని చూసిన సమకాలిక నటులు ‘నభూతో నభవిష్యతి’ అని కీర్తించారు.

నటీమణి గీతాంజలికి తెలుగులో ఇదే తొలిచిత్రం కాగా ఈ చిత్రం లో సీత పాత్ర ద్వారా తెలుగు తెరకు పరిచయం అయింది.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ గారికి దక్షిణాదిన మొట్టమొదటి ఫుల్ లెంగ్త్ మూవీ ఇదే కావడం విశేషం.

నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో “సీతారామ కల్యాణం” ఉత్తమ చిత్రంగా ప్రశంసలు అందుకున్నది.
“సీతారామకల్యాణం” చిత్రానికి ఎన్టీఆర్ గారు తొలిసారిగా దర్శకత్వం వహించి నప్పటికి టైటిల్స్ లో మాత్రం ఆయన దర్శకుడుగా పేరు వేసుకోలేదు.

ఎన్టీఆర్ గారి దర్శకత్వ ప్రతిభనూ విమర్శకులు సైతం ప్రశంసించారు. ఆ యేడాది ఫిలిమ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో యన్టీఆర్ కు ఉత్తమ దర్శకునిగా అవార్డు కూడా లభించింది. ఈ చిత్రానికి రాష్ట్రపతి ప్రశంసా పత్రం కూడా లభించింది.

ఈ సినిమాను ఎన్టీఆర్ గారు తల్లి దండ్రుల పాద పద్మములకు సమర్పించారు. మొదట కె.వి.రెడ్డి దర్శత్వంలో ఎన్టీఆర్ శ్రీరాముడి గా సినిమా తీయాలనుకున్నారు.

ధనేకుల బుచ్చి వెంకట కృష్ణచౌదరి ఇచ్చిన కథతో ఎన్టీఆర్ నిర్ణయం మార్చుకుని రావణాసురుడు పాత్రను తానే పోషించాలని నిర్ణయించుకోవడంతో, దర్శకత్వం చేయటానికి కె.వి.రెడ్డి గారు అంగీకరించలేదు, దానితో దర్శకత్వ బాధ్యతను కూడా ఎన్టీఆర్ గారు చేపట్టవలిసి వచ్చింది.

“సీతారామ కళ్యాణం” సినిమా చూశాక తాను ఎన్టీఆర్ అభిమానినయ్యానని అక్కినేని నాగేశ్వరరావు గారు పేర్కొనటం విశేషం “రావణాసురుడు” పాత్ర తన అభిమాన పాత్ర అని ఎన్టీఆర్ గారు అప్పట్లో ఆంధ్రపత్రిక వారపత్రిక లో స్వయంగా పేర్కొన్నారు.

రావణుడు కైలాసపర్వతాన్ని ఎత్తే సన్నివేశంలో పదితలలు కనిపించడం కోసం.. నగాయిచ్-ఎన్టీఆర్ తీవ్రంగా శ్రమించారు.

అనుకున్న దృశ్యం రావడం కోసం.. ఎన్టీఆర్ దాదాపు 10 గంటల పాటు చేతులు చాచి నిశ్చలంగా పైకి చూస్తూ ఉండిపోయారు ఎన్టీఆర్​ లో రావణుడిని చూడలేనంటూ దర్శకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్న కే.వీ.రెడ్డి గారు ఈ చిత్రం ప్రివ్యూ చూసి ఎన్టీఆర్ ​ను ప్రత్యేకంగా అభినందించారు.

అలాగే ఎన్టీఆర్ గారి గురువు కవిసమ్రాట్ విశ్వనాథ సత్య నారాయణ గారు ఈ చిత్రం చూసి శిష్యుని ఆశీర్వదించారు. కంచి పీఠాధిపతి జగద్గురువు శ్రీ పరమాచార్య చంద్ర శేఖర్ సరస్వతి ఈ చిత్రం చూసి ఎన్టీఆర్​ను ప్రత్యేకంగా ఆశీర్వదించారు….

“సీతారామకళ్యాణం” చిత్రం 28 ప్రింట్లతో విడుదల కాగా, ఈ చిత్రం ఘన విజయాన్ని సొంతం చేసుకుని విడుదలైన అన్ని కేంద్రాలలోనూ 50 రోజులు (అర్ధ శతదినోత్సవం జరుపుకుంది. మొత్తం 9 కేంద్రాలలో డైరెక్ట్ గా 100 రోజులు ప్రదర్శింపబడి శతదినోత్సవం జరుపుకున్నది.

విజయవాడ శ్రీలక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ లో ఏకధాటిగా 156 రోజులు ప్రదర్శితమై ఆ యేడాది సంక్రాంతి కి విడుదలైన చిత్రాల్లో మేటిగా నిలచింది.

‘సీతారామకళ్యాణం’ చిత్రం ఘనవిజయాన్ని చూసిన సినీ పండితులు సైతం ఆశ్చర్యపోయారు. పండిత, పామరులు సైతం ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టారు. ఈ చిత్రం పలుమార్లు రీ-రిలీజ్ అయినప్పుడు కూడా వసూళ్ళ వర్షం కురిపించింది.

100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:-
1. విజయవాడ — శ్రీలక్ష్మీ టాకీస్ (156 రోజులు)
2. గుంటూరు –. హరిహర మహల్
3. నెల్లూరు — వెంకటేశ్వర
4. విశాఖపట్నం — లక్ష్మీ టాకీస్
5. ఏలూరు — షా మహల్
6. విజయనగరం — అశోక
7. తెనాలి — వెంకటేశ్వర
8. కాకినాడ — సత్యగౌరి
9. బెంగళూరు – స్టేట్స్.

(ఈ సినిమా1961 లో విడుదల అయినప్పటికి, సెన్సార్ 1960 లో జరగటం వల్ల) 1960 సంవత్సరం 8 వ జాతీయఫిల్మ్ అవార్డ్స్ లో తెలుగు విభాగంలో ఉత్తమ చిత్రం గా అవార్డ్ పొందింది.

ఆ యేడాది ఫిలిమ్ క్రిటిక్స్ అవార్డ్స్ లో యన్టీఆర్ గారికి ఉత్తమ దర్శకునిగా అవార్డు కూడా లభించింది.
మద్రాస్ ఫిల్మ్ ఫ్యాన్స్ అసోసియేషన్ వారిచే 1961 సంవత్సరానికి ఉత్తమ దర్శకుడు గా ఎన్టీఆర్ గారు
ఎంపికయ్యారు….

Related posts