నందమూరి తారకరామారావు గారు తొలిసారిగా పరమశివుని పాత్ర లో నటించిన పౌరాణిక చిత్రం వరలక్ష్మి పిక్చర్స్ వారి “దక్షయఙ్ఞం” 10-05-1962 విడుదలయ్యింది.
ప్రముఖ నటి కన్నాంబ సమర్పణలో నిర్మాత, దర్శకుడు కె.బి.నాగభూషణం గారు వరలక్ష్మి పిక్చర్స్ బ్యానర్ పై స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి మాటలు, పాటలు: ఆరుద్ర, సంగీతం: సాలూరి హనుమంతరావు, కెమెరా: లక్ష్మణ్ గోరే, కళ: తోట వెంకటేశ్వరరావు, నృత్యం: పసుమర్తి కృష్ణమూర్తి, కూర్పు: ఎన్.కె.గోపాల్ అందించారు.
ఈచిత్రం లో ఎన్.టి. రామారావు, దేవిక, యస్.వి. రంగారావు, కన్నాంబ, రామకృష్ణ, రాజశ్రీ, రాజనాల, పద్మనాభం, అమరనాథ్, మిక్కిలినేని, సూరిబాబు రఘురామయ్య, మహంకాళి వెంకయ్య, ఛాయాదేవి, మాధవపెద్ది సత్యం, మీనాకుమారి, వాసంతి, తదితరులు నటించారు.
నటీమణి కన్నాంబ, కె.బి.నాగభూషణం దంపతులు ఈచిత్రాన్ని నిర్మించారు.
ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి హనుమంతరావు గారి సంగీత సారధ్యంలో
“హర హర మహాదేవ శంభో, అక్షయలింగ విభోస్వయం భో”
“జాబిలి ఓహో జాబిలి,పిలేచే నీచెలి కొసరే కోమలి”
“కమనీయం కైలాసం కాంతుని సన్నిధి”
“కోయిలా తెలుపవటే కోరిన జతగాడు”
వంటి పాటలు, పద్యాలు శ్రోతలను ఆకట్టుకున్నాయి.
లయకారకుడైన పరమేశ్వరునిగా ఎన్టీఆర్ గారు దక్షయజ్ఞం లో కనిపిస్తారు. ఈ సినిమా మంచి విజయం సాధించి, ఎన్టీఆర్ గారికి మంచి పేరు పెరు తెచ్చి పెట్టిoది.
కానీ ఈ చిత్రం విడుదలైన తరువాత ఆయన పెద్ద కుమారుడు నందమూరి రామకృష్ణ మరణించటంతో లయకారకుడైన శివుని పాత్ర ధరించి శివతాండవం చేసి నందు వల్ల ఇలా జరిగిందని తలచి, ఇక ఈశ్వరుని పాత్ర ధరించకూడదని ఆయన నిశ్చయించుకున్నారు.
కానీ విజయా వారు ఉమా చండీ గౌరీ శంకరుల కథ సినిమా తీయాలనుకున్నప్పుడు దర్శకులు కే.వి.రెడ్డి గారు ఎన్టీఆర్ గారిని శివుని పాత్రలో నటించమని అడిగారు. ఎన్టీఆర్ తన నిశ్చయాన్ని చెప్పి, క్షమించమని అన్నారు.
లయకారకుడైన శివునిగా కాక భోగ శివుడుగా చిత్రీకరిస్తామని, జటాఝూటం లేకుండా కిరీటం పెడతామని, సినిమా ప్రారంభం, చివర మాత్రమే శివునిలా కనిపిస్తారని, మిగతా సినిమా అంత జానపద చిత్రాలలో మాదిరిగా కనిపిస్తారని చెప్పి ఆయనను ఒప్పించారు.
“దక్ష యజ్ఞం” సినిమా తర్వాత ఎన్టీఆర్ గారు “ఉమా చండీ గౌరీ శంకరుల కథ” సినిమాలో మాత్రమే శివుని పాత్ర పోషించారు.
ఎన్టీఆర్ గారికి ఇది 99 వ చిత్రం. ఈ సినిమా తరువాత విడుదలైన “గుండమ్మ కధ” 100 వ సినిమా కావటం విశేషం. ఈ చిత్రంలో ఎన్టీఆర్, ఎస్.వి.ఆర్ పోటీపడి నటించారు.
ఆ ఏడాది విడుదలైన ఎన్టీఆర్ గారి సినిమాలు “భీష్మ, గుండమ్మకథ, రక్త సంబంధం, ఆత్మబంధువు, గులేబకావళి కధ” చిత్రాల మధ్య “దక్ష యజ్ఞం” సినిమా యావరేజ్ గా నడిచింది.
ఈ చిత్రంలో తన భార్య సతీదేవి అగ్నికి ఆహుతి అయినదని తెలిసిన పిదప పరమశివుడు పాత్రలో పూర్తిగా. లీనమై పోయి ఎన్టీఆర్ చేసేన శివ తాండవం సినిమా కు హైలైట్ గా నిలిచింది.
సినిమా క్లైమాక్స్ లో నటి కన్నాంబ తన భర్త ధక్షుడు మృతిచెందిన పిదప ముల్లోకాలను, త్రిమూర్తులను శాసిస్తూ చెప్పే డైలాగ్స్ సూపర్బ్. ప్రస్తుతం ఆవిధంగా డైలాగ్ లు చెప్పే నటీనటులు మనకి కానరావడం లేదు.
ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు పైగా ఆడింది.
విజయవాడ – శ్రీరామా టాకీస్ లో 64 రోజులు ప్రదర్శింపబడింది.
ఈ సినిమాను1975లో తమిళంలో “దక్ష యజ్ఞం”
పేరుతోనే డబ్బింగ్ చేసి విడుదల చేయటం విశేషం.