telugu navyamedia
సినిమా వార్తలు

51 సంవత్సరాల ఎన్ .టి .ఆర్ “బడిపంతులు”

పద్మశ్రీ నందమూరి తారక రామారావు అసమాన నటనా ప్రాభావాన్ని ప్రదర్శించిన చిత్రం “బడిపంతులు”. ఈ సినిమా విడుదలై నేటికి 51 సంవత్సరాలవుతుంది. ఎన్ .టి .రామారావు, అంజలీదేవి జంటగా నటించిన ఈ సినిమా 23 నవంబర్ 1972లో ఆంధ్ర ప్రదేశ్ లో విడుదలయ్యింది .

త్రివేణి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు పి. చంద్రశేఖర రెడ్డి దర్శకత్వంలో నిర్మాత పి. పేర్రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి మాటలు: డి. వి.నరసరాజు, పాటలు: సి.నారాయణరెడ్డి, ఆరుద్ర, దాశరథి, ఆత్రేయ,
సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్,
కళ: ఎస్.కృష్ణారావు, నృత్యాలు: పసుమర్తి కృష్ణమూర్తి, హీరాలాల్, కూర్పు: వి.అంకిరెడ్డి, అందించారు.
ఈ చిత్రంలో ఎన్.టి.రామారావు, అంజలి, జగ్గయ్య, నాగభూషణం, రామకృష్ణ, కృష్ణంరాజు, జానకి, జయంతి, విజయలలిత, రాజబాబు, రావి కొండలరావు, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, టి.పద్మిని, రాధాకుమారి, సూర్యాకాంతంతో పాటు శ్రీదేవిరామారావు గారికి మానవరాలుగా నటించడం విశేషం.

సంగీత దర్శకుడు కె.వి.మహదేవన్
గారి స్వరకల్పనలో వచ్చిన పాటలు హిట్ అయ్యాయి.
“భారత మాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు”,
“మీ నగు మోము నా కనులారా కడదాకా కననిండూ”,
“బూచాడమ్మా బూచాడు,బుల్లిపెట్టెలో ఉన్నాడు,”
“నిన్న మొన్న రేకు విప్పిన లేత మొగ్గా”
“ఓరోరి పిల్లగాడా,వగలమారి పిల్లగాడా”
వంటి మధురమైన పాటలు శ్రోతలను అలరించాయి.

ఎన్.టి.రామారావు చలన చిత్ర రంగంలో చేసిన ఎన్నో చిత్రాల్లో ఆణిముత్యంగా పేర్కొన దగిన చిత్రం”బడిపంతులు” . ఎన్.టి.ఆర్ . తన సినీ జీవితంలో రెండే రెండు సార్లు పూర్తి స్థాయి వయో వృద్దుని పాత్రలను పోషించారు. అందులో ఒకటి 1962 లో విడుదలైన “భీష్మ” పౌరాణిక చిత్రమైతే, రెండవది 1972 లో విడుదలైన సాంఘిక చిత్రం “బడిపంతులు”  ఈ రెండూ సినిమాలు ఘన విజయం సాధించడం విశేషం.

“బడి పంతులు” సినిమాకు మాతృక కన్నడం లో బి.ఆర్.పంతులు నిర్మించిన ‘స్కూల్ మాస్టర్’ చిత్రం,ఈ సినిమా 1958 జనవరి 31 న విడుదల అయ్యింది. ఆ సంవత్సరం ఫిల్మ్ ఫేర్ అవార్డు “బడిపంతులు” చిత్రం లో ఎన్టీఆర్ గారి నటనకు అందచేశారు. ఈ చిత్రం పలు కేంద్రాలలో 50 రోజులు, మూడు కేంద్రాల్లో (విజయవాడ, వైజాగ్, గుంటూరు) 100 రోజులు ఆడి శత దినోత్సవం జరుపుకున్నది.

Related posts