telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 సంవత్సరాలు

తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రస్థానంలో ఓ కీలక మైలురాయిని చేరుకున్నారు.

ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేసి నేటికి (సెప్టెంబర్ 1) సరిగ్గా 30 సంవత్సరాలు పూర్తయింది.

నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో  ప్రస్తుతం నాలుగోసారి సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండటం విశేషం.

1994 ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధించిన తర్వాత పార్టీలో చోటుచేసుకున్న అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు నాయుడు శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు.

ఆ క్రమంలో 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలు చేపట్టారు.

చిత్తూరు జిల్లా నారావారిపల్లెలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి రాష్ట్ర రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పరిపాలనలో వినూత్న సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ‘ప్రజల వద్దకే పాలన’, ‘జన్మభూమి’, ‘శ్రమదానం’ వంటి కార్యక్రమాలతో ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకు చేరువ చేశారు.

ప్రత్యేకించి, సాంకేతికతపై ఆయనకున్న ముందుచూపుతో హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి పునాదులు వేశారు.

ఇది ఐటీ రంగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పటంలో నిలబెట్టింది. ఆయన హయాంలోనే ఏర్పాటైన డ్వాక్రా సంఘాలు గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశాయని విశ్లేషకులు పేర్కొంటారు.

రాష్ట్ర రాజకీయాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో, ఇద్దరు ప్రధానుల ఎంపికలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారు.

ఏపీజే అబ్దుల్ కలాంను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రతిపాదించడంలోనూ చంద్రబాబు ముఖ్య భూమిక వహించారు.

2004, 2009 ఎన్నికల్లో వరుస ఓటముల తర్వాత పదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా కొనసాగారు. ఆ సమయంలో ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీని బలోపేతం చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు.

రాష్ట్ర విభజన అనంతరం, 2014లో నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.

ఇటీవలి ఎన్నికల్లో ఘన విజయంతో నాలుగోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన ఆయన, ప్రస్తుతం నవ్యాంధ్ర పునర్నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

Related posts