telugu navyamedia
క్రీడలు వార్తలు

భారత మహిళల జట్టుపై మాజీ కోచ్‌ ఆరోపణలు…

గత గురువారం మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ స్థానంలో టీమిండియా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్‌ని మహిళల టీమ్ చీఫ్ కోచ్‌గా బీసీసీఐ నియమించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే టీమిండియా దిగ్గజాలు సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్‌కి భారత మహిళల క్రికెట్‌ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్ ఒక ఈ మెయిల్ పంపినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహిళా జట్టులో కొంత మంది క్రికెటర్ల ఆధిపత్యం పెరిగిపోయిందని, జట్టుకి మించి ఎవరూ ఎక్కువ కాకూడదని లేఖలో స్పష్టం చేశారట. ఇప్పటికైనా స్టార్ కల్చర్‌కి స్వస్తి పలకాలని సూచించినట్లు సమాచారం. జట్టుని మళ్లీ గాడిన పెట్టేందుకు అవసరమైతే తాను రోడ్ మ్యాప్‌ని సిద్ధం చేస్తానని రామన్ మెయిల్‌లో పేర్కొన్నారట. బోర్డు అధ్యక్షుడికి మాజీ కోచ్‌ డబ్ల్యూవీ రామన్‌ ఈ మెయిల్‌ పంపింది నిజమేనని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. దీనిపై బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారి తెలిపారు. మొత్తం మీద సీనియర్‌ క్రికెటర్, హైదరాబాదీ స్టార్‌ మిథాలీ రాజ్‌ మళ్లీ వార్తల్లో నిలిచినట్లయింది. పేరు చెప్పకపోయినా ఇప్పుడు అందరికళ్లూ మిథాలీపైనే కేంద్రీకృతమయ్యాయి. రెండేళ్ల క్రితం కోచ్‌గా ఉన్న రమేశ్ పవార్‌పై తీవ్రస్థాయిలో మిథాలీ ఆరోపణలు గుప్పించిన విషయం తెలిసిందే.

Related posts