telugu navyamedia
సామాజిక

శ్రీ శ్రీ “మహాప్రస్థానం” నాకు స్ఫూర్తి – భగీరథ

ఆధునిక మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ ) అంటే తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు .

1950వ సంవత్సరంలో రచించిన “మహాప్రస్థానం” అప్పట్లో పెను సంచలనం కలిగించింది. అప్పటివరకు సాంప్రదాయ పద్దతిలో కవులు ఛందోబద్దమైన కవిత్వాన్ని వ్రాసేవారు .

శ్రీ శ్రీ ” మహాప్రస్థానం “లో వచన కవిత్వానికి శ్రీకారం చుట్టాడు . ఛందోబద్దమైన కవిత్వాన్ని పక్కన పెట్టాడు . ఇది శ్రీ శ్రీని సరికొత్తగా ఆవిష్కరించింది . యువ కవులు ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని కవిత్వం వ్రాయడం మొదలు పెట్టారు .

శ్రీ శ్రీ ఆధునిక కవుల్లో అగ్రగణ్యుడు . వైతాళికుడు . అభ్యుదయ రచయితల సంఘ అధ్యక్షుడు గా , విప్లవ రచయితల సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడుగా , సినిమా పాటల కవిగా శ్రీ శ్రీ జీవిత ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకం .
ఈ రోజు 112వ జయంతి .

తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేసి, నవ యువ కవులకు మార్గ నిర్ధేశకుడుగా, స్ఫూర్తి ప్రదాతగా ఎప్పటికీ మిగిలిపోయిన మహాకవితో నాకు ప్రత్యేకమైన అనుబంధం వుంది .

1979లో నిర్మాత దర్శకుడు యు. విశ్వేశ్వర రావు నిర్మించిన “నగ్న సత్యం ” సినిమా విడుదల సందర్భగా మహాకవి శ్రీ శ్రీ , దర్శకుడు పి . పుల్లయ్య , దర్శకుడు కె .బి .తిలక్, కృష్ణవేణి తో పాటు నన్ను కూడా ఆహ్వానించారు. గుంటూరు , విజయవాడ లో నగ్నసత్యం సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ ల సందర్శనకు వెళ్ళాము. నేను అప్పుడు ఆంధ్ర జ్యోతి సంస్థ నుంచి వెలువడే జ్యోతి చిత్ర పత్రిక కు హైద్రాబాద్ లో . రిపోర్టర్ గా పనిచేస్తున్నాను . అప్పుడు విశ్వేశ్వర రావు గారు శ్రీ శ్రీ గారిని , పుల్లయ్య గారిని పరిచయం చేశారు .

మూడు రోజులపాటు మహాకవితో శ్రీశ్రీ తో పాటు కలసి వుండే అవకాశం అదృష్టం కలిగింది. నేను శ్రీ శ్రీ గారి మహాప్రస్థానం చదివి , ఆప్రేరణతో కవిత్వం వ్రాయడం మొదలు పెట్టాను . ఆ కవితలతో :మానవత” అన్న కవితా సంకలనాన్ని వెలువరిస్తున్నాను . ఆ సందర్భంగా నా కవితా సంకలనానికి ముందు మాట వ్రాయించామని విశ్వేశ్వర రావు గారిని అడిగాను . ఆయన మానవత ఒక కాపీ మద్రాస్ పంపించమన్నారు . నేను పంపించిన వారానికే శ్రీ శ్రీ గారు ముందు మాట వ్రాసి పంపించారు .

మళ్ళీ విశ్వేశ్వర రావు గారిని , శ్రీ శ్రీ గారిని , పుల్లయ్య గారిని పుస్తకావిష్కరణకు రమ్మని ఆహ్వానించాను . విశ్వేశ్వర రావు గారు అంగీకరించారు . శ్రీ శ్రీ గారితో మానవత ఆవిష్కరింపజేద్దామని విశ్వేశ్వర రావు గారు చెప్పారు . నేను మహదానంద పడ్డాను .
1980 జూన్ 1వ తేదీన హైదరాబాద్ లోని అశోక్ నగర్ నగర కేంద్ర గ్రంధాలయ సంస్థ హాలులో “మానవత ” కవితా సంపుటి ఆవిష్కరణ సభను కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఏర్పాటు చేసింది .

అప్పటి హై కోర్ట్ ప్రధాన న్యాయ మూర్తి ఆవుల సాంబశివ రావు, దర్శకులు పి .పుల్లయ్య , విశ్వేశ్వర రావు , జి .ఎస్ .వరదాచారి , ఆచార్య తిరుమల పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్నారు .

అయితే సభకు వచ్చిన మహాకవి శ్రీ శ్రీ గారిని విరసం సభ్యులు ఘరావ్ చేశారు. కారణం కిన్నెరకు డీజీపీ ఎమ్ .వి నారాయణ రావు అధ్యక్షులు . ఆయన ఎంతో మంది నక్షలైట్లను చంపించారు కాబట్టి ఈ సభలో పాల్గొనడానికి వీల్లేదని శ్రీ శ్రీ గారిని ఆపారు . ఆయన నేను ఈ సభలో పాల్గొంటాను అన్నారు .

మీకు విరసం కన్నా ఈ పుస్తకావిష్కరణ సభ ఎక్కువా ? అని నిలదీశారు . “ప్రస్తుతానికి నాకు ఇదే ముఖ్యం , అందుకే నేను మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చాను ” అని వారిని కాదని శ్రీ శ్రీ “మానవత ” కవితా సంపుటి ని ఆవిష్కరించారు .మహాకవి శ్రీ శ్రీ ఆవిష్కరించిన “మానవత” నా సాహిత్య జీవితానికి గొప్ప పునాది వేసింది .

-భగీరథ

Related posts