telugu navyamedia
సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” ప్రెస్ మీట్ : తెర వెనుక జరిగిన కథ ఇదే…!

RRR-Press-Meet

రాజమౌళి నేడు ఆర్.ఆర్.ఆర్ చిత్రంపై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమౌళి, చరణ్, తారక్, దానయ్య తదితరులు పాల్గొన్నారు. “ఆర్ఆర్ఆర్” చిత్రం కూడా ఒక కల్పన అని, ఇప్పటి వరకు ఆయన తీసిన చిత్రాల మాదిరిగానే భారీ సెట్టింగులు ఉంటాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

RRR

నాడు అల్లూరి సీతారామరాజు, కొమరం భీంలు దేశం కోసం స్వాతంత్ర పోరాటం చేసి, పిన్న వయసులోనే బ్రిటిష్ వారి చేతిలో ప్రాణత్యాగం చేశారు. నిజానికి వీరిద్దరూ ఎవరి ఉద్యమంలో వారు ఉన్నారు, ఒకరికొకరు తెలియకుండా పోరాటం చేశారు. అదేవిధంగా దేశంకోసం ప్రాణత్యాగం చేశారు. అయితే వీరిద్దరూ ఒకే చోట ఉండి, ఉద్యమంలో పాల్గొంటే ఎలా ఉండబోతుంది అనేదే రాజమౌళి తనదైన శైలిలో తెరకెక్కించనున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా చరణ్, సీతగా అలియా భట్, కొమరం భీం పాత్రలో తారక్, ఎన్టీఆర్ సరసన డేజీ ఎడ్గర్ జోన్స్ అనే విదేశీ భామ నటిస్తోంది. ఇక అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అన్ని భాషలకు ఆర్.ఆర్.ఆర్ కామన్ టైటిల్. కానీ ప్రతి భాషకు ఒక్కో టైటిల్ ఉంటుంది. 2020 జూలై 30 నాటికీ సినిమా విడుదలవుతుంది.

ఈ సమావేశంలో జక్కన్న ఓ ఆసక్తికర విషయం చెప్పారు. బాహుబలి మొదలు పెట్టినప్పటి నుంచే రాజమౌళి ఎప్పటికైనా “మహాభారతం” సినిమా తీయాలన్నదే తన కల అని చెప్పారు. ఈ సమావేశంలో కూడా జక్కన్నకు “మహాభారతం”పై ప్రశ్న ఎదురైంది. “బాహుబలి” తర్వాతే “మహాభారతం” సినిమా తీస్తారని ప్రచారం జరిగింది. ఇంతకీ మహాభారతం ఎప్పుడు మొదలవుతుంది? అనే ప్రశ్న రాజమౌళికి ఎదురుకాగా, ‘‘మహాభారతం” నా డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పాను. కానీ నేను తీసే తర్వాతి సినిమా అదే అని జనాలు ఫిక్స్ అయిపోతున్నారు. నేను ఎన్నిసార్లు క్లారిఫై చేసినా నా నెక్ట్స్ చిత్రం అదే అని అనుకుంటున్నారు. నేను ఎక్కడికి వెళ్లినా దాని గురించే అడుగుతారు. బహుశా అదే నా చివరి చిత్రం అవ్వొచ్చు. దాన్ని సిరీస్‌గా తీసే ఆలోచన ఉంది. బాహుబలి వెబ్ సిరీస్ కూడా త్వరలో మొదలుపెట్టబోతున్నాం’’ అని జక్కన్న వెల్లడించారు.

RRR

మాకు దిష్ఠి తగలకూడదు : ఎన్టీఆర్
ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ… “జక్కన్నతో నాకు ఇది నాలుగో సినిమా. ఈ చిత్రం నా కెరీర్‌లో స్పెషల్ చిత్రంగా మిగిలిపోతుంది. ఎందుకంటే జక్కన్నతోపాటు.. చరణ్‌తో పనిచేయడం దీని ప్రత్యేకత. మా ఇద్దరి బాండింగ్ ఈ చిత్రంతో మొదలవలేదు. నాకు తెలిసిన మంచి స్నేహితుడు.. కష్టసుఖాలు పంచుకునే మిత్రుడు. ఈ బాండింగ్ ఎప్పుడో ఏర్పడింది.. ఈ చిత్రంలో మేమిద్దరం కలిసి పనిచేయడంతో అది వేరే లెవల్‌కి వెళ్లిపోయింది. మేము ఎప్పటికీ ఇలాగే ఉండాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా. ఎందుకంటే.. మంచి బంధాలు వచ్చినప్పుడే దిష్టి తగులుతుంది అని మా అమ్మ చెబుతూ ఉంటుంది. మా ఇద్దరికీ ఆ దిష్టి తగలకూడదు అని ముందుగా దాని గురించి చెప్పాను’’ అని చెప్పుకొచ్చాడు తారక్.

RRR-Press-Meet2

తారక్ ను అక్కడ చూసి షాకయ్యా… : రామ్ చరణ్
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ‘‘సంవత్సరం క్రితం నేను ఊరెళ్లడం కోసం ఎయిర్‌పోర్టుకు వెళ్తున్నా. ఆ దారిలో రాజమౌళి గారి ఇల్లు ఉంది. ఆయన మా ఇంటికి ఒకసారి వచ్చేసి వెళ్లు అన్నారు. ఆయన ఇంట్లోకి వెళ్లాక.. ఒక మంచి ఫోజులో తారక్ నేల మీద అలా రిలాక్స్ అయి కూర్చున్నాడు. అదేంటి ఈయనున్నాడు ఇక్కడ అనుకున్నాను. తారక్ నా మొహం చూసి “ఏంటి బ్రో నువ్విక్కడ” అన్నాడు. నేను కూడా ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? అన్నా. వెంటనే తారక్.. “మీరిద్దరూ ఏమైనా మాట్లాడుకోవాలా రాజమౌళి గారు… నేను బయటకు వెళ్తాను” అన్నాడు. “కాదు.. నువ్వేమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడు… నేను కాసేపు బయట వెయిట్ చేస్తా. నాకు ఫ్లైట్‌కి కొంచెం సమయం ఉంది” అన్నాను.

RRR1

కాసేపు మా కన్ఫ్యూజన్‌ను అలాగే కొనసాగనిచ్చి… “మీ ఇద్దరూ ఆగండి” అని మా ఇద్దరినీ లోపలికి తీసుకెళ్లి… అప్పుడే అనౌన్స్ చేయడం జరిగింది. మా ఇద్దరికీ తెలియని అనౌన్స్‌మెంట్ ఆయన చెప్పడంతో చాలా హ్యాపీ అనిపించింది. తారక్, నేనూ ఇద్దరం ఒకరి మొహాలు ఒకరం చూసుకుని వెళ్లి రాజమౌళిని గట్టిగా పట్టుకుని ఈ సినిమాలో చేయడం చాలా ఆనందంగా ఉందని చెప్పాం. నా జీవితంలో ఆ రోజును మరచిపోలేను. ఆ నెక్ట్స్ సెకన్‌లో మేం సోఫాలో కూర్చొని తీసుకున్న ఫోటోనే మీరు చూశారు. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ. నేను తారక్‌తో పనిచేయడాన్ని చాలా ఎంజాయ్ చేస్తున్నా’’ అంటూ చెర్రీ చెప్పుకొచ్చాడు.

Related posts