telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఐపీఎల్ : అనూహ్యంగా విజయం సాధించిన .. పంజాబ్..

punjab won on hyderabad ipl 2019

ఐపీఎల్ లో సన్‌రైజర్స్‌కు పంజాబ్‌ పంచ్‌ ఇచ్చింది. ఆ జట్టు సమష్టిగా ఆడిన వేళ 6 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. సోమవారం మొదట బ్యాటింగ్‌ చేసిన సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్లకు 150 పరుగులు చేసింది. డేవిడ్‌ వార్నర్‌ (70 నాటౌట్‌; 62 బంతుల్లో 6×4, 1×6) మరోసారి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్‌తో పాటు మయాంక్‌ అగర్వాల్‌ (55; 43 బంతుల్లో 3×4, 3×6) కూడా సత్తా చాటడంతో లక్ష్యాన్ని పంజాబ్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

151 పరుగుల ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలో ఎదురు దెబ్బ తగిలింది. గేల్‌ (16)ను రషీద్‌ఖాన్‌ ఔట్‌ చేశాడు. అయితే మరోసారి ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచిన రాహుల్‌, మయాంక్‌తో కలిసి విజయానికి బాటలు వేశాడు. ఆఫ్‌సైడ్‌ కట్‌ షాట్లు, కవర్‌ డ్రైవ్‌లతో ఆకట్టుకున్న రాహుల్‌.. నెమ్మదిగా పంజాబ్‌ను విజయానికి చేరువ చేశాడు. మరోవైపు మయాంక్‌ కూడా ధాటిగా ఆడడంతో పంజాబ్‌ 17 ఓవర్లకు 132/1తో సులభంగా గెలిచేలా కనిపించింది. అయితే 18వ ఓవర్‌ వేసిన సందీప్‌శర్మ (2/21) మయాంక్‌, మిల్లర్‌ (1)లను ఔట్‌ చేసి మూడు పరుగులే ఇవ్వడంతో చివరి రెండు ఓవర్లలో పంజాబ్‌ 16 పరుగులు చేయాల్సి వచ్చింది. ఐతే 19వ ఓవర్లో మన్‌దీప్‌ సింగ్‌ (2)ను పెవిలియన్‌ చేర్చిన సిద్ధార్థ్‌ కౌల్‌ (1/42).. ఐదు పరుగులే ఇవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా మారింది. నబి వేసిన ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. తొలి రెండు బంతులకు రెండేసి పరుగులు తీసిన సామ్‌ కరన్‌ (5 నాటౌట్‌).. మూడో బంతికి సింగిల్‌ తీసి రాహుల్‌కు స్ట్రెక్‌ ఇచ్చాడు. నాలుగో బంతికి బౌలర్‌ తల మీదగా అద్భుతమైన ఫోర్‌ బాదిన రాహుల్‌.. ఆ తర్వాత బంతికి మరో రెండు పరుగులు చేసి పంజాబ్‌కు విజయాన్ని అందించాడు.

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌లో వార్నర్‌ ఆటే హైలైట్‌. 7 పరుగులకే బెయిర్‌స్టో (1) వికెట్‌ కోల్పోయినా.. విజయ్‌ శంకర్‌ (26; 27 బంతుల్లో 2×4)తో కలిసి వార్నర్‌ సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌కు పునాది వేశాడు. అయితే వీళ్లిద్దరూ కుదురుకున్నా.. పిచ్‌ నెమ్మదిగా ఉండడంతో వేగంగా ఆడలేకపోయారు. పది ఓవర్లకు సన్‌రైజర్స్‌ చేసింది 50 పరుగులే. శంకర్‌ను అశ్విన్‌ ఔట్‌ చేసి ఆ జట్టును మరింత ఇబ్బంది పెట్టాడు. ఈ జోడీ రెండో వికెట్‌కు 55 పరుగులు జత చేసింది. తర్వాత వార్నర్‌ ఓ మోస్తరు వేగంతో ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ రన్‌రేట్‌ మరీ పడిపోకుండా చూశాడు. అతను 49 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో అత్యధిక స్కోరర్‌గా ఉన్న వార్నర్‌కి ఇది మూడో అర్ధ సెంచరీ. 18 ఓవర్లకు సన్‌రైజర్స్‌ స్కోరు 124 మాత్రమే. 19వ ఓవర్లో 11 పరుగులు రాగా.. ఆఖరి ఓవర్లో చివరి మూడు బంతులకు హుడా (14 నాటౌట్‌; 3 బంతుల్లో 2×4, 1×6) రెండు ఫోర్లు, ఒక సిక్స్‌ బాదడంతో సన్‌రైజర్స్‌ మెరుగైన స్కోరు సాధించింది. షమి (1/30), ముజీబ్‌ రెహ్మాన్‌ (1/34), అశ్విన్‌ (1/30) ప్రత్యర్థిని కట్టడి చేశారు.

punjab won on hyderabad ipl 2019నేటి మ్యాచ్ : చెన్నై vs కలకత్తా రాత్రి 8 గంటలకు జరుగుతుంది.

Related posts