telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

బజరంగ్ పునియా.. ఆసియా రెజ్లింగ్‌ లో వరుసగా రెండో స్వర్ణం…

bajarangh punia got gold in asia championship

బజ్‌రంగ్‌ పునియా.. ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా పతకం సాధిస్తాడనే అంచనాలు మరింత పెంచేస్తున్నాడు. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా పతకాలు సాధిస్తున్న బజ్‌రంగ్‌.. తీవ్రమైన పోటీ ఉండే ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండో స్వర్ణం సాధించాడు. పురుషుల 65 కేజీల ఫ్రీస్టైల్‌ ఫైనల్లో బజ్‌రంగ్‌ 12-7తో కజకిస్థాన్‌ క్రీడాకారుడు సయాత్‌బెక్‌ ఒకసోవ్‌ను ఓడించాడు.

కామన్వెల్త్‌, ఆసియా క్రీడల ఛాంపియన్‌ బజ్‌రంగ్‌.. ఫైనల్లో ఇంకో నిమిషం మాత్రమే మిగిలుండగా 2-7తో వెనుకబడి ఉండటం గమనార్హం. ఆ దశలో అతను గెలుస్తాడని ఎవ్వరూ ఊహించలేదు. అయితే చివరి నిమిషంలో అసాధారణ ప్రదర్శన చేసిన బజ్‌రంగ్‌.. ఫలితాన్ని మార్చేశాడు. ఒకసోవ్‌ ఊహించని విధంగా ఒక్కసారిగా దూకుడు పెంచిన బజ్‌రంగ్‌ 8 పాయింట్లు కొల్లగొట్టి ప్రత్యర్థిని దాటేశాడు. చివరి నిమిషంలో బజ్‌రంగ్‌ మెరుపు దాడికి ఒకసోవ్‌ షాకైపోయాడు.

మరో భారత బాక్సర్‌ పర్వీన్‌ రాణా రజతం సాధించాడు. 79 కేజీల ఫ్రీస్టైల్‌ విభాగం ఫైనల్లో పర్వీన్‌ 0-3తో ఇరాన్‌కు చెందిన మహ్మద్‌ తెయ్‌మౌరి చేతిలో పరాజయం పాలయ్యాడు. రాణా రజతమే గెలిచినప్పటికీ.. గత ఏడేళ్లలో అతను సాధించిన అతి పెద్ద పతకం ఇదే. అంతకుముందు సెమీస్‌లో అతను 3-2 ఉసెర్బయేవ్‌ (కజకిస్థాన్‌)పై విజయం సాధించాడు. 57 కేజీల విభాగంలో రవికుమార్‌ రెపిచేజ్‌ రౌండ్లో 4-0తో చియా లియు (చైనీస్‌ తైపీ)ని ఓడించి కాంస్య పోరుకు అర్హత సాధించాడు. 97 కేజీల్లో సత్యవర్త్‌ కడియన్‌ కూడా కాంస్యం కోసం పోటీ పడనున్నాడు. అతను క్వార్టర్స్‌లో.. ఉల్జిసైఖన్‌ (మంగోలియా) చేతిలో ఓడాడు. అయితే ప్రత్యర్థి ఫైనల్‌ చేరడంతో కాంస్యం కోసం పోటీ పడే అవకాశం సత్యవర్త్‌కు దక్కింది.

Related posts