telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఓ బేబీ” మా వ్యూ

Oh-Baby

బ్యాన‌ర్స్‌: సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్, క్రాస్ పిక్చ‌ర్స్‌
న‌టీన‌టులు: సమంత అక్కినేని, నాగ‌శౌర్య‌, ల‌క్ష్మి, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, తేజ స‌జ్జ‌, ప్ర‌గ‌తి త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వం: బి.వి.నందినీ రెడ్డి
నిర్మాత‌లు: సురేష్ బాబు, సునీత తాటి, టి.జి.విశ్వప్ర‌సాద్‌, హ్యున్ హు, థామ‌స్ కిమ్
సంగీతం : మిక్కి జె.మేయ‌ర్‌
ఎడిట‌ర్‌: జునైద్ సిద్ధిఖీ

దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో “ఓ బేబీ” అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు. “ఎంత సక్కగున్నావే” అనేది ట్యాగ్ లైన్. “మిస్ గ్రానీ” అనే కొరియన్ సినిమాను నందిని రెడ్డి రీమేక్ చేశారు. అనుకోకుండా జరిగిన ఒక సంఘటన ద్వారా లక్ష్మి అనే వృద్ధురాలు యువతిగా మారితే ఎలా ఉంటుందనేది చిత్ర కథ. లేడీ ఓరియెంటెడ్ కథతో “ఓ బేబీ”గా వస్తున్న సమంత ప్రేక్షకులను ఎంత మేరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ :
70 ఏళ్ళ సావిత్రి అలియాస్ బేబీకి పాతకాలపు అలవాట్లతో చాదస్తం కూడా ఎక్కువే. యుక్త వయసులోనే భర్త చనిపోవడంతో ఒంటి చేత్తో తన కొడుకు (రావురమేష్)ని పోషించి పోషిస్తుంది. బేబీ కొడుకు ఓ కాలేజీలో లెక్చరర్ గా పని చేస్తుంటాడు. అదే కాలేజీలో బేబీ తన ఫ్రెండ్ (రాజేంద్రప్రసాద్)తో కలిసి క్యాంటీన్ నడుపుతుంది. అయితే బేబీ అతిప్రేమతో అందరినీ విసిగిస్తుంటుంది. ఈ క్రమంలోనే ఆమె కోడలి (ప్రగతి)కి అనారోగ్యం చేయడంతో బేబీని ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. దీంతో బేబీ జరిగిందంతా తలచుకొని బాధ పడుతుంది. మళ్ళీ ఆ యవ్వనం తిరిగొస్తే బాగుంటుంది కదా… అనుకుంటుంది. అనుకోకుండా వృద్ధాప్యంలో ఉన్న బేబీ యుక్త వయసు బేబీగా మారిపోతుంది. బేబీ అలా ఎలా మారింది ? ఆ తరువాత ఏం జరిగింది ? ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి? బేబీ అలాగే ఉండిపోయిందా ? లేకపోతే మళ్ళీ వృద్ధాప్యంలోకి ప్రవేశించిందా ? చివరికి ఏం జరిగింది ? అనేది తెలియాలంటే సినిమాను వెండితెరపై వీక్షించాల్సిందే.

నటీనటుల పనితీరు :
స‌మంత నటన గురించి ప్ర‌త్యేకంగా చెపుకోవాల్సిందే. ఈ సినిమాలో ఎమోష‌న్ మాత్రమే కాకుండా కామెడీని కూడా బాగా పండించారు. ల‌క్ష్మి లాగా ఆమె న‌డిచే న‌డ‌క‌, మేన‌రిజ‌మ్స్ ఆక‌ట్టుకుంటాయి. ఆమె భ‌ర్త‌గా కన్పించిన అడివి శేష్ కు ఉన్నది రెండు మూడు స‌న్నివేశాలే అయినా చక్కగా ఒదిగిపోయాడు. సీనియర్ నటి ల‌క్ష్మి బేబీ పాత్రలో సునాయాసంగా నటించారు. కొడుకు ప‌ల‌క‌రింపే క‌ర‌వైన‌ప్ప‌టికీ, ప్ర‌జ‌ల్లో ప‌రువుగా బ‌త‌కాల‌నుకునే ఊర్వ‌శి పాత్ర కూడా బావుంది. ఈ సినిమాలో రాజేంద్ర‌ప్ర‌సాద్ పోషించిన పాత్ర ఆయనకు కెరీర్‌లో గుర్తుండిపోతుంది. ఆయ‌న కుమార్తెగా న‌టించిన సున‌య‌న కూడా చ‌క్క‌గా న‌టించింది. జ‌గ‌ప‌తిబాబు పాత్ర కూడా ప్రత్యేకమైనది. రావు రమేష్ చక్కగా నటించారు. కోడ‌లి పాత్ర‌కు ప్ర‌గ‌తి చ‌క్క‌గా సరిపోయింది. నాగ‌శౌర్య తన పాత్రతో ఆకట్టుకుంటాడు.

సాంకేతిక వర్గం పనితీరు :
రీమేక్ చిత్రాలను నేటివిటీకి తగ్గట్లుగా తెరకెక్కించడం క‌త్తిమీద సామే. ఈ చిత్రంలో చ‌క్క‌టి కుటుంబ విలువ‌లు, స్వ‌చ్ఛ‌మైన స్నేహం, కాపాడుకోవాల్సిన ప‌రువు, పేగు బంధాలు అన్నింటినీ మిళితం చేసి మంచి కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించడంలో విజయం సాధించారు దర్శకురాలు నందిని రెడ్డి. పాటల కంటే నేపథ్య సంగీతం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

రేటింగ్ : 3/5

Related posts