ఎన్నికల వేళ నేతలు ఎలాగైనా నగదు సరఫరా చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా, అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు కాన్వాయ్‌లో రూ. 1.8 కోట్లు పట్టుబడటం సంచలనం రేపుతున్నది. ఇటీవల జరిపిన తనిఖీల్లో ఈ డబ్బు బయటపడింది. దీనితో ఈశాన్యంలో బీజేపీ ఓట్లకు నోట్లు పంచుతున్నదంటూ కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పెమాఖండు, డిప్యూటీ సీఎం చౌనా మేతో పాటు ప్రధాని నరేంద్ర మోదీపైనా కేసు నమోదు చేయాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు.
పసిఘాట్‌లో అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. అక్కడే ప్రధాని మోదీ ఎన్నికల ర్యాలీ నిర్వహించడం విశేషం. దీనితో ఈశాన్య ఓటర్లను డబ్బు ఆశ చూపించి బీజేపీ వలలో వేసుకుంటున్నదని సూర్జేవాలా ఆరోపించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల సంఘం అధికారులు, పోలీసుల సమక్షంలో ముఖ్యమంత్రి కాన్వాయ్ నుంచి డబ్బు రికవరీ చేస్తున్న రెండు వీడియోలను సూర్జేవాలా మీడియాకు చూపించారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు తమకు లభించాయని ఆయన చెప్పారు. కచ్చితంగా ఓడిపోతామనే భయంతోనే బీజేపీ డబ్బు పంచే కార్యక్రమానికి తెర తీసిందని సూర్జేవాలా విమర్శించారు. ఏకంగా సీఎం కాన్వాయ్ నుంచే ఈ డబ్బు పట్టుబడటం అరుణాచల్‌లో సంచలనం సృష్టించింది.
ఈ కారణం చేతనే తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కాన్వాయ్ ను కూడా ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇక నుండి ఎవరి వాహనం అయినా ఈసీ అధికారులు తనిఖీ చేసి తీరుతారని తెలుస్తుంది.