telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

తొలి టీ20 .. గెలిపించిన విరాట్.. విరుచుకుపడ్డాడు..

india win in first t20 on westindies

ఉప్పల్ మైదానంలో విండీస్ నిర్దేశించిన 208 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 4 వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలోనే ఛేదించింది. విరాట్ వీర విహారం చేయడంతో ఇండియా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. హోరాహోరీగా సాగిన పోరులో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(94 నాటౌట్: 50 బంతుల్లో 6ఫోర్లు, 6సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టడంతో టీ20 సిరీస్‌లో భారత్ బోణీ కొట్టింది. ఓపెనర్ కేఎల్ రాహుల్(62: 40 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ(8) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ ఓపెనర్ రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సాధించాల్సిన రన్‌రేట్ ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఆఖర్లో బ్యాట్ ఝుళిపించాడు. లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్ తమ ఇన్నింగ్స్‌ను ధాటిగానే ఆరంభించింది. కోహ్లీ, రాహుల్ స్ట్రైకింగ్ రొటేట్ చేసుకుంటూ ప్రత్యర్థి బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించారు. చెత్త బంతులను బౌండరీలకు తరలించడంతో పాటు ఆఖర్లో ఎక్కువగా బౌండరీల మోత మోగించారు. విలియమ్స్ వేసిన 16వ ఓవర్లో 23 పరుగులు రావడంతో భారత్ విజయం ఖాయమైంది. రిషబ్ పంత్(18), శ్రేయాస్ అయ్యర్(4) నిరాశపరిచారు. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్ 1-0తో ముందంజ వేసింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ ఇన్నింగ్స్‌లో హెట్‌మైర్(56: 41 బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) అర్ధశతకంతో రాణించడంతో 20 ఓవర్లలో విండీస్ 5 వికెట్లకు 207 పరుగులు చేసింది. ఆఖర్లో హోల్డర్ 9 బంతుల్లో 24 రన్స్ చేయడంతో ప్రత్యర్థి జట్టు అలవోకగా భారీ స్కోరు చేయగలిగింది. విధ్వంసక ఆల్‌రౌండర్ పొలార్డ్(37: 19 బంతుల్లో ఫోర్, 4సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆడటంతో పాటు హెట్‌మైర్‌తో విలువైన భాగస్వామాన్ని నెలకొల్పాడు. చాహర్ వేసిన 17వ ఓవర్లో హెట్‌మైర్, పొలార్డ్ ఇచ్చిన క్యాచ్‌లను ఫీల్డర్లు జారవిడవడంతో భారత్ భారీ మూల్యమే చెల్లించుకుంది. ఓపెనర్ ఎవిన్ లూయిస్(40 17 బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) ఆరంభంలోనే మంచి ఆరంభాన్ని అందించాడు. దూకుడైన ఆటతో బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. రెండో ఓవర్‌లోనే దీపక్ చాహర్ విండీస్‌కు షాకిచ్చాడు. చాహర్ బౌలింగ్‌లో ఓపెనర్ లెండిల్ సిమన్స్(2) ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్యాట్స్‌మెన్ బ్రాండన్ కింగ్(31), హోల్డర్(24 నాటౌట్: 9 బంతుల్లో ఫోర్, 2సిక్సర్లు), దినేశ్ రాందిన్(11 నాటౌట్: 7 బంతుల్లో ఫోర్) తమదైన శైలిలో మెరుపులు మెరిపించారు. కరీబియన్ బ్యాటింగ్ లైనప్‌లో అందరూ హిట్టర్లే ఉండటంతో వచ్చిన వారు వచ్చినట్లే బౌండరీల మోత మోగించారు. సీనియర్ పేసర్లు భువనేశ్వర్ కుమార్ ఆరంభంలో కరీబియన్ల వేగానికి అడ్డుకట్ట వేసినప్పటికీ ఆఖరి ఓవర్లో ధారళంగా పరుగులిచ్చాడు. 20వ ఓవర్లో హోల్డర్ ఫోర్, సిక్సర్ బాది 17 రన్స్ రాబట్టడంతో 200 మార్క్‌ను అధిగమించింది. భారత బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు తీశాడు.

Related posts