telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బీజేపీ ప్రజా సమస్యలను ద్రుష్టి మళ్లించే.. రాజకీయాలు చేస్తుంది.. : సిపిఎం

cpm comments on bjp govt

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలను ఉన్న సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు మత ప్రాతిపదికన వివిధ ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తుందని సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు తెలిపారు. గుంటూరులో శనివారం స్థానిక వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో వందేళ్ల కమ్యూనిస్టు ఉద్యమ ప్రస్థానం, సమకాలిన రాజకీయ పరిణామాలు అనే అంశాలపై శనివారం సదస్సు నిర్వహించారు. సిపిఎం గుంటూరు తూర్పు జిల్లా కార్యదర్శి పాశం రామారావు అధ్యక్షతన జరిగిన సభలో రాఘవులు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ మోడీ, అమిత్‌షా కలసి కాశ్మీర్‌ను మత ప్రాతిపదికన ముక్కలు చేశారని చెప్పారు. అయోధ్య వివాదంలో అన్యాయమైన తీర్పు వచ్చిందని తెలిపారు. దేశంలో ఆర్థిక మాంద్యం పెరిగిపోయి నిరుద్యోగులు ఉపాధి లేక ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే కేంద్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మరల్చేందుకు ఆర్టికల్‌ 370 రద్దు, పౌరసత్వం బిల్లు, కాశ్మీర్‌ బిల్లు, అయోధ్య తీర్పు తదితర అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. జమ్మూకాశ్వీర్‌లో 70 వేల మంది పోలీసులను ఉపయోగించి తీవ్ర నిర్భంధం అమలు చేస్తూ 5,500 ఇళ్లనే అనధికారిక జైళ్లుగా మార్చారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో అలజడులు పెరిగాయన్నారు.

బిజెపి ప్రభుత్వ విధానం వల్ల ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందని, 4.5 శాతంకు వృద్ధిరేటు పడిపోయిందన్నారు. ఆటోమొబైల్‌ రంగంలో 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని తెలిపారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు, బిస్కట్లు కొనేవారు కరువయ్యారని తెలిపారు. గుంటూరు జిల్లాలో టెక్స్‌టైల్‌ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుందన్నారు. భాషని నిర్లక్ష్యం చేసిన ఏ దేశం ముందుకు పోలేదన్నారు. ఇంగ్లీషులోనే బోధించాలని నిబంధనల సహేతుకం కాదన్నారు. చైనాలో ఇప్పటికీ స్థానిక భాష ప్రాధాన్యత కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో ఇంగ్లీషు భాష ప్రవేశ పెట్టడంపై క్రైస్తవ మత వ్యాప్తి కోసం అని బిజెపి విమర్శిస్తుందని, ఇదే సమయంలో దేశం మొత్తం హిందీ అమలు చేయాలని బిజెపి ఎందుకు డిమాండ్‌ చేస్తుందని ప్రశ్నించారు.

ఏ దేశం మత ప్రాతిపదికన అభివృద్ధి చెందలేదని తెలిపారు. బిజెపి కూడా మత ప్రాతిపదికన పనిచేస్తుందని దీని వల్ల దేశం అభివృద్ధి అథోగతి పాలవుతుందన్నారు. లౌకిక రాజ్యం ద్వారానే అభివృద్ధి సాధ్యం అన్నారు. దేశంలో పెట్టుబడిదారి వ్యవస్థ ఉన్నంత వరకూ కమ్యూనిస్టులు ఉంటారని ఆయన తెలిపారు. 1885లో ఏర్పడిన కాంగ్రెస్‌ కన్నా 1920లో ఏర్పడిన కమ్యూనిస్టు పార్టీ స్వాతంత్య్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించిందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత రైతుల పిల్లలను విద్యావంతులను చేయడంలో కమ్యూనిస్టు ఉద్యమాలే కారణం అన్నారు. విద్యావంతులైన ఎంతో మంది ఇతర దేశాలకు వెళ్లినా వారి అభివృద్ధికి తోడ్పాటును అందించిందని కమ్యూనిస్టులేనని వారు మర్చిపోలేరన్నారు. దేశంలో కమ్యూనిస్టులు అంతం కావాలంటే పెట్టుబడి దారి వ్యవస్థ అంతం కావాలని, పెట్టుబడి దారి వ్యవస్థ ఉన్నంత కాలం కమ్యూనిస్టులు ఉంటారని ఆయన తెలిపారు.

Related posts