నరేంద్ర మోదీ భారత దేశ ప్రధాన మంత్రిగా గురువారం సాయంత్రం ప్రమాణం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఎన్డీయే ఘన విజయం సాధించిన నేపథ్యంలో నరేంద్ర మోదీ వరుసగా రెండో పర్యాయం ప్రధానిగా పదవీప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి దేశవిదేశాలకు చెందిన ప్రముఖులు రావడంతో రాష్ట్రపతి భవన్ సందడిగా మారింది. బిమ్ స్టెక్ దేశాల అధినేతలు, పలు దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, బీజేపీ సీనియర్లు ఎల్కే అద్వానీ, మురళీమనోహర్ జోషి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తమిళనాడు సీఎం పళనిస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు సినీ తారలు రజనీకాంత్, కంగనా రనౌత్, కరణ్ జోహార్, అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ దంపతులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.