డ్రగ్స్ కేసులో…బెంగళూరులో తీగలాగితే…తెలంగాణలో డొంక కదులుతోంది. ఈ కేసులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. 2019లో బెంగళూరు శివారులోని ఓ ఫాంహౌస్‌లో జరిగిన పార్టీలో…డ్రగ్స్ ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు తేల్చారు. నాలుగు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు. ఫాంహౌస్‌లో పార్టీలో పాల్గొన్న వారికి ఇప్పటికే నోటీసులు పంపారు. పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌రెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా నోటీసులు జారీ చేశారు. పార్టీలో ముగ్గురు సినీ ప్రముఖులతో పాటు 8 మంది ఈవెంట్ మేనేజర్లతో పాటు తెలంగాణకు చెందిన నలుగురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. కలహర్‌రెడ్డి, రతన్‌రెడ్డిలకు పోలీసులు నోటీసులు పంపారు. వీటికి వారిద్దరు స్పందించలేదు. ఓ యువ ఎమ్మెల్యే ఇచ్చిన విందులో డ్రగ్స్ ఉపయోగించినట్లుగా గుర్తించారు. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారని తెలుస్తోంది. త్వరలో వీరందరికి నోటీసులు పంపే అవకాశం ఉంది.
అయితే…తాజాగా తెలంగాణ క్యాబినెట్ లోని ఓ మంత్రికి బెంగుళూరు డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్నట్టు కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొందరు స్నేహితులతో కలిసి ఆ మంత్రి శ్రీలంక టూర్ కు వెళ్లారని.. అక్కడే సదరు మంత్రి డ్రగ్స్ విషయంలో కల్పించుకున్నారని తెలుస్తోంది. అంతటితో ఆగకుండా హైదరాబాద్ కు డ్రగ్స్ తన వెంట తెచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రి అనుచరులతో పాటు ఎమ్మెల్యేలు కూడా డ్రగ్స్ తీసుకున్నారని, ఆ ఆధారాల కోసం ఇప్పుడు కర్ణాటక పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. శ్రీలంక టూర్ లో జరిగిన పార్టీలో వచ్చిన డ్రగ్స్ బెంగళూరు నుంచే సరఫరా అయినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో కనుగొన్నారని సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో పాటు మంత్రికి కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. దీంతో ఈ ఆరోపణలపై అధికార ఎమ్మెల్యేలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.