telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్లను జూన్ చివరినాటికి లబ్ధిదారులకు అప్పగిస్తాము: మంత్రి పొంగూరు నారాయణ

ఆంధ్రప్రదేశ్‌లో టిడ్కో ఇళ్ల లబ్దిదారులకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ గుడ్ న్యూస్ చెప్పారు.

టిడ్కో ఇళ్లపై నిన్న శాసనసభలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నారాయణ సమాధానమిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 2,61,640 టిడ్కో ఇళ్ల నిర్మాణాలను వచ్చే సంవత్సరం జూన్ చివరినాటికి పూర్తి చేసి, మౌలిక సదుపాయాలు సహా లబ్ధిదారులకు అప్పగిస్తామని తెలిపారు.

“ప్రతి శనివారం పూర్తయిన ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు అప్పగిస్తాం,” అని మంత్రి పేర్కొన్నారు. నిర్మాణ పనులపై విభాగాలు నిత్యం సమీక్షిస్తున్నాయని తెలిపారు.

“2014–2019 మధ్య ఏడులక్షల మంది పట్టణ ప్రజలకు ఇళ్ల అవసరాన్ని అంచనా వేశాం. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, వాటిని 2.61 లక్షలకు కుదించి, 4.39 లక్షల ఇళ్లను ఏకపక్షంగా రద్దు చేసింది. 2019 మే నాటికి మేము 71,000 ఇళ్లను పూర్తిచేశాం.

ఆ తర్వాత 1.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనులు పక్కనపెట్టబడ్డాయి,” అని మంత్రి నారాయణ ఆరోపించారు.

అసంపూర్తిగా ఉన్న ఇళ్ల నిర్మాణం పూర్తి చేయటానికి గాను కాంట్రాక్టర్ల బకాయిలు, ఇతర మౌలిక సదుపాయాలతో కలిపి మొత్తం రూ.7,280 కోట్లు అవసరమని తెలిపారు.

ఈ నిధులను వేర్వేరు మార్గాల్లో సమీకరించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని మంత్రి నారాయణ వివరించారు.

టిడ్కో ఇళ్లపై రంగుల అంశాన్ని మంత్రి నారాయణ ప్రస్తావిస్తూ .. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లు నిర్మించినప్పుడు, పార్టీ రంగులు వేయకూడదని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, కానీ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఆ పార్టీ రంగులు వేసిందన్నారు.

అయితే ఆ రంగులు వేసేందుకు ఉత్తర్వులు లేకపోవడం వల్ల, వాటికి నిధులు మంజూరు చేయలేమని సాంకేతిక కమిటీ అభిప్రాయపడిందని తెలిపారు.

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాడు రంగులు వేయమని చెప్పిందే ప్రభుత్వమని, అధికారుల సూచన మేరకే రంగులు వేశారని, ఇప్పుడు నిధులు ఇవ్వనంటే ఎలా అని విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు.

Related posts