telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

విశాఖ మెట్రో రైలు గాడిలోకి – రూ.11,498 కోట్లతో మూడు కారిడార్లు, 42 స్టేషన్లు

నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ కొద్దిసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఈ టెండర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు.

అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ప్రకారం, విశాఖ మెట్రోకు సంబంధించి మొత్తం మూడు కారిడార్లు రూపొందించారు.

కారిడార్ – 1:

  • విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు
  • దూరం: 34 కిలోమీటర్లు
  • ఇది ప్రధాన కారిడార్‌గా పేర్కొన్నారు. ఈ మార్గం విశాఖ నగరాన్ని తూర్పు నుంచి పశ్చిమ దిశగా అనుసంధానిస్తుంది.

కారిడార్ – 2:

  • గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు
  • దూరం: 5 కిలోమీటర్లు
  • ఈ మార్గం నగరంలోని మధ్య ప్రాంతాలను కవర్ చేస్తుంది.

కారిడార్ – 3:

  • తాడిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేరు వరకు
  • దూరం: 7 కిలోమీటర్లు
  • ఇది ఉత్తర భాగాన్ని మెట్రోతో అనుసంధానిస్తుంది.
  • మొత్తం 42 స్టేషన్లు..

    ఈ మూడు కారిడార్లలో కలిపి మొత్తం 42 మెట్రో స్టేషన్లను నిర్మించనున్నట్లు AMRC వెల్లడించింది. ప్రతి స్టేషన్ ఆధునిక సదుపాయాలతో, ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్మించనున్నట్లు సమాచారం. ఈ మెట్రో ప్రాజెక్టును మూడు ఏళ్లలో పూర్తి చేయడం లక్ష్యంగా అధికారులు ముందుకు సాగుతున్నారు. ఈ దశలో టెండర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

    ప్రత్యేక ఆకర్షణ – మెట్రోతో పట్టణాభివృద్ధి

    ఈ మెట్రో ప్రాజెక్టు పూర్తయిన తర్వాత విశాఖపట్నం నగరం ట్రాఫిక్ రద్దీ నుండి ఉపశమనం పొందడంతోపాటు, మౌలిక సదుపాయాల్లో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటాయని నగర ప్రణాళిక వర్గాలు భావిస్తున్నాయి. మెట్రో రాకతో రియల్ ఎస్టేట్, వ్యాపార కార్యకలాపాలు విస్తృతంగా అభివృద్ధి చెందనున్నాయి.

Related posts