telugu navyamedia
తెలంగాణ వార్తలు

కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్‌ నేతలు ..

తెలంగాణ కాంగ్రెస్‌లో గత కొద్ది రోజులుగా నల్లగొండ జిల్లా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం హాట్ టాపిక్‌ మారింది. గత కొన్నిరోజులుగా ఆయన కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని, బీజేపీకి వెళ్తారని.. విస్తృతస్థాయిలో ప్రచారం జరుగుతోంది. అలాగే పార్టీ మారే విషయంపై ఆయన నేరుగా స్పందించకుండానే రకరకాల స్టేట్‌మెంట్‌లు ఇస్తున్నారు.

అయితే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలో పేరుకుపోయిన అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం అన్ని మార్గాలుగా ప్రయత్నిస్తుంది. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ పెద్ద‌లు వ‌రుస‌గా ఆయన ఇంటికే క్యూ కడుతున్నారు.

వీహెచ్, సీఎల్పీ నేత భట్టి చాలా మందే యత్నాలు చేశారు. ఆఖరికి ఢిల్లీ నుంచి దిగ్విజయ్ సింగ్ కూడా ఆయనతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ రండి అంతర్గత విషయాలు ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం అంటూ డిగ్గీ రాజా రాజగోపాల్ కు ఫోన్ చేశారు.

తాజాగా.. ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో రాజగోపాల్‌రెడ్డి భేటీ ముగిసింది. రాజగోపాల్‌రెడ్డి ఇంట్లో గంటపాటు ఈ ఇద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. రాజగోపాల్‌రెడ్డి పార్టీ వీడకుండా ఆపే బాధ్యతను ఉత్తమ్‌కు అప్పగించింది ఏఐసీసీ. మరోవైపు ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డి కూడా రాజగోపాల్‌ రెడ్డితో భేటీ అయి.. ఆయనతో చర్చలు జరిపారు.

మరోవైపు రాజగోపాల్ రెడ్డి తాను కాంగ్రెస్‌ను వీడనున్నాననే సంకేతాలు పంపిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీకి రావాలని కోరిన కూడా ఆయన వెళ్లలేదు.

తెలంగాణ రాష్ట్రాన్ని.. సొంత ఆస్తిగా మార్చుకున్న కేసీఆర్‌పై అతి త్వరలో యుద్ధ ప్రకటన చేయతున్నానని  రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్‌ నియంత పాలనకు చరమగీతం పాడేందుకు మరో కురుక్షేత్ర యుద్ధానికి శంఖం పూరిస్తానని తెలిపారు. కౌరవ సేనను ఎదురించి, రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పాటు దిశగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎన్నికలు వస్తేనే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేసే ముఖ్యమంత్రి.. ఉద్దేశపూర్వకంగానే మునుగోడు నియోజకవర్గపై కక్ష కట్టారని ఆరోపించారు. మూడున్నరేళ్లుగా తనతో పాటు నియోజకవర్గ ప్రజలను అనేక రకాలుగా అవమానపరిచి, అభివృద్ధి పనులను నిలిపివేశారని విమర్శించారు. టీఆర్‌ఎస్‌ రాక్షస పాలన నుంచి విముక్తి చేసే దిశగా తాను వేస్తున్న అడుగులో రాజీ పడే ప్రసక్తి లేదని, వెనకడుగు వేయడం తన రక్తంలోనే లేదని పేర్కొన్నారు.

అయితే తాను బీజేపీలో చేరతానని చెప్పలేదని.. వచ్చే ఎన్నికలు పాండవులు, కౌరవుల మధ్యే జరుగుతాయని రాజగోపాల్ రెడ్డి అన్నారు

Related posts