మెగాస్టార్ చిరంజీవి కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వివరించింది. చిన్ననాటి నుండే తల్లిదండ్రులు తనను స్వతంత్రంగా పెంచారని, ఈ సమాజంలో నమ్మకంగా జీవించడం ఎలాగో నేర్పిస్తూ అన్ని విషయాల్లో తనకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారని ఉపాసన తెలిపింది. అదే తనను ఈ రోజున స్వతంత్ర మహిళగా నిలబెట్టిందని తెలిపింది. తన జీవితంపై తండ్రి ప్రభావం ఎక్కువగా ఉందని, ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో అయినా దైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం ఆయన వద్ద నేర్చుకున్నానని చెప్పింది. ఇతరులను ప్రేమించడం, ఆప్యాయత చూపించడం లాంటి ఎన్నో అంశాలు తన తండ్రి ద్వారానే అలవర్చుకున్నానని ఉపాసన చెప్పుకొచ్చింది. అయితే పెళ్లి తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని చెప్పిన ఉపాసన.. మెట్టినింటిలో అడుగుపెట్టాక జీవితంలో సర్దుబాటు అంటే ఏమిటో తెలిసిందని, అడ్జస్ట్ అయి బ్రతకడం నేర్చుకున్నానని, కాస్త ఇబ్బంది కూడా పడ్డానని చెప్పింది. తనకు నచ్చిన సెలబ్రిటీని వివాహం చేసుకోవడం అదృష్టమని, ఆన్‌స్క్రీన్ రామ్ చరణ్‌కి ఇంట్లో ఉండే రామ్ చరణ్‌కి చాలా తేడా ఉంటుందని ఆమె చెప్పింది. కాకపోతే ఆ సీక్రెట్ మాత్రం చెప్పానంటూ ఆసక్తికరంగా స్పందించింది ఉపాసన. రామ్ చరణ్, తాను భార్యాభర్తల్లా కాకుండా స్నేహితుల్లా ఉంటూనే ఒకరి వృత్తిని మరొకరం గౌరవిస్తామని ఆమె తెలిపింది. ఈ లాక్‌డౌన్ సమయంలో ఇద్దరికీ కావాల్సినంత సమయం దొరకడంతో ఇంట్లోనే ఉంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశామని ఉపాసన చెప్పింది. రామ్ చరణ్ ఫ్యామిలీ సెలబ్రిటీ ఫ్యామిలీ మాత్రమే కాదని ఇది ఓ బిజినెస్ ఫ్యామిలీ కూడా అని ఆమె చెప్పడం విశేషం.
previous post
రాజకీయాలంటే అసహ్యం… సంచలనం సృష్టిస్తున్న హాలీవుడ్ నట దిగ్గజం వ్యాఖ్యలు