telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులకు తెలంగాణ సహకరించాలి” – సీఎం రేవంత్‌కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  లేఖ రాశారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రతిపాదించిన పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కార్యక్రమాలపై తెలంగాణ ప్రభుత్వ సహకారం కోరుతూ లేఖ రాశారు.

బొగ్గు మంత్రిత్వ శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు , ముఖ్యంగా కోల్ ఇండియా లిమిటెడ్, నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ .. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో భాగస్వామ్యం కుదుర్చుకుని, సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు , బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ వంటి కీలకమైన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

ఈ ప్రాజెక్టులు వచ్చే మూడేళ్లలో దాదాపు రూ.10 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్శించనున్నాయన్నారు కేంద్రమంత్రి.

* తెలంగాణలోని అధిక సౌరవిద్యుదుత్పత్తి సామర్థ్యం గల జోన్‌లను గుర్తించి ఆయా ప్రాంతాల్లో సౌర విద్యుత్ ప్లాంట్లను అభివృద్ధి చేయడం.

* గ్రిడ్ స్టెబిలిటీ, ఎనర్జీ రిలయబిలిటీలను మరింత పెంచేలా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం.

* క్రిటికల్ బ్యాలెన్సింగ్ కెపాసిటీని అందించేందుకు పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాల అధ్యయనం, అమలు.

* ప్రాజెక్టు అమలును వేగవంతం చేయడానికి, స్థానిక ఆర్థిక ప్రయోజనాలను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలతో లేదా బొగ్గు కంపెనీలు స్వతంత్ర ప్రాతిపదికన జాయింట్ వెంచర్ మోడల్స్ ఏర్పాటు చేయడం.

ఈ ప్రతిపాదనలు, ప్రాజెక్టులకు భూసేకరణ, భూకేటాయింపు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతు అవసరమని కేంద్రమంత్రి లేఖలో పేర్కొన్నారు.

ఈ ప్రాజెక్టులు విజయవంతంగా అమలుకావడానికి రాష్ట్ర ప్రభుత్వం, సీపీఎస్‌యూల మధ్య నిర్మాణాత్మక భాగస్వామ్యం, సరైన సమన్వయం అత్యంత అవసరమని వెల్లడించారు.

ఇందుకోసం ముఖ్యమంత్రి ప్రత్యేకమైన చొరవతీసుకోవాలని కోరుతున్నామన్నారు. పునరుత్పాదక విద్యుదుత్పత్తిలో తెలంగాణ సామర్థ్యాన్ని గుర్తిస్తూ రాష్ట్రంలో హరితాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణమైన చిత్తశుద్ధితో సహకారం అందిస్తోందని చెప్పారు.

ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. భారతదేశ సుస్థిర విద్యుత్ వ్యవస్థలో తెలంగాణ పాత్ర కీలకం కానున్న సందర్భంలో ఈ ప్రాజెక్టుల ప్రాధాన్యత మరింత పెరగనుందన్నారు.

పర్యావరణ పరిరక్షణతో పాటుగా ఆత్మనిర్భరతతో కూడిన భవిష్యత్‌ను ఏర్పర్చుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిర్మాణాత్మక సహకారం అవసరమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

Related posts