మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ లో ఒకప్పుడు ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేవి. అయితే “మా “ను ఎప్పుడైతే రాజకీయ అవసరాలకు వాడుకుందామని అనుకున్నారో అప్పటి నుంచే ఈ అనారోగ్యకరమైన పోటీ మొదలైంది. 2015లో అధ్యక్షుడుగా మాగంటి మురళి మోహన్ టర్మ్ అయిపొయింది. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఆయన ఆ పదివిలో ఉంటున్నాడు. మళ్ళీ మురళి మోహన్ అధ్యక్షుడుగా వుండాలని అనుకున్నాడు. కానీ అప్పటికే రాజేంద్ర ప్రసాద్ తాను అధ్యక్షుడుగా ఉంటానని అన్నాడు.
మురళి మోహన్ తాను నచ్చచెప్పడానికి ప్రయత్నం చేశాడు. మిగతా హీరోలతో కూడా చెప్పించాడు. కానీ రాజేంద్ర ప్రసాద్ తాను ఉండి తీరవలసిందే అన్నాడు. రాజేంద్ర ప్రసాద్ మనస్తత్వం భిన్నంగా ఉంటుంది. అతను ఎవరి మాటా వినడు. ఈ విషయం మురళీమోహన్ కు బాగా తెలుసు. మూవీ ఆర్టిస్ట్ ను వదులుకోవడానికి మురళి మోహన్ సిద్ధంగా లేదు. అప్పటికే అసోసియేషన్ ను తెలుగు దేశం పార్టీకి ప్రయోజనం కూరేలా ఉపయోగిస్తున్నాడని అపవాదు వచ్చింది. అయినా మురళి మోహన్ లెక్కచేయ్యలేదు. తను చెప్పినట్టు వినే శ్రీమతి జయసుధను పోటీలోకి దించాడు. చాలామంది హీరోల మద్దతు కూడకట్టాడు.
రాజేంద్ర ప్రసాద్ కు చిన్న నటులంతా మద్దతు పలికారు. చిరంజీవి సోదరుడు నాగబాబు, రాజేంద్ర ప్రసాద్ వైపు వుంది ప్రచారం చేశాడు. మురళీమోహన్ మీద వున్న వ్యతిరేకత, రాజేంద్ర ప్రసాద్ అంటే వున్న గౌరవం, నమ్మకం కలసి వచ్చాయి. మొదటిసారి “మా ” ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ లో శివాజీరాజా వున్నాడు. మురళి మోహన్ తన శక్తి యుక్తులన్నీ ఉపయోగించాడు. కానీ విజయం సాధించలేదు.
రాజేంద్ర ప్రసాద్ గెలిచాడు. జయసుధ ఓడిపోయింది. ఆ తరువాత రాజేంద్ర ప్రసాద్ టర్మ్ పూర్తి అయ్యాక మరో మారు వుండాలని అనుకున్నాడు. అయితే కొత్తవారికి అవకాశం ఇవ్వమని అడిగితె పోటీ నుంచి తప్పుకున్నాడు. శివాజీ రాజా అధ్యక్షుడు గాను నరేష్ కార్యదర్శి గాను ఎన్నికయ్యారు. ఇప్పుడు శివాజీరాజా మళ్ళీ అధ్యక్షుడుగా పోటీచేస్తున్నాడు. కార్యదర్శిగా వున్న నరేష్ ఇప్పుడు అధ్యక్షుడుగా పోటీలో వున్నాడు. అప్పుడు మురళి మోహన్ లాగానే ఇప్పుడు శివాజీరాజా “మా ” ను వదిలిపెట్టలేక పోటీకి దిగాడు. శివాజీరాజా ప్యానెల్ లో హేమాహేమీలు వున్నారు, అతనే విజయం సాధించవచ్చు.. కానీ అనారోగ్యకరమైన పోటీ తత్వాన్ని కొనసాగిస్తున్నాడు. “మా ” రాజకీయ రంగు పూసుకొని బజారున పడిపోయింది.

