telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

విదేశీ క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు : ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్

Max

ఆస్ట్రేలియా వేదికగా ఈ ఏడాది అక్టోబరు – నవంబరులో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్ వాయిదా పడటంతో… ఐపీఎల్ 2020 సీజన్‌కి మార్గం సుగుమమైంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకూ ఐపీఎల్‌ని నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన బీసీసీఐ.. గవర్నమెంట్ పర్మీషన్ కోసం ఎదురుచూస్తోంది. అయితే.. ఈ టోర్నీ ఎక్కడ జరిగినా తాను ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ వెల్లడించాడు. 2008 నుంచి ఐపీఎల్ జరుగుతుండగా.. 2012లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చిన మాక్స్‌వెల్ ఇప్పటి వరకూ 69 మ్యాచ్‌లాడి 1,397 పరుగులు చేశాడు. అలానే బౌలింగ్‌లోనూ 16 వికెట్లు పడగొట్టిన మాక్స్‌వెల్.. గత ఏడాది వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్‌‌కి దూరంగా ఉన్నాడు. అయినప్పటికీ.. ఐపీఎల్ 2020 సీజన్‌ కోసం రూ. 10.75 కోట్లకి అతడ్ని వేలంలో పంజాబ్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా మాక్స్ మాట్లాడుతూ ‘‘విదేశీ క్రికెటర్లలో నాతో పాటు చాలా మంది ఐపీఎల్‌లో ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విమాన ప్రయాణ ఆంక్షలు, క్వారంటైన్ ఇబ్బందులు లేకపోతే టోర్నీలో ఆడేందుకు నాకేమీ అభ్యంతరాలు లేవు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు ఈ టోర్నీలో ఆడతారు. కాబట్టి.. ఐపీఎల్‌ కూడా వరల్డ్‌కప్ లాంటిదే. ఐపీఎల్‌‌‌లో ఆడటాన్ని నేను బాగా ఆస్వాదిస్తా’’ అని మాక్స్‌వెల్ వెల్లడించాడు.

Related posts