తిరుమల శ్రీవారి సేవకు భక్తులు ఇచ్చే ప్రతి రూపాయి నేరుగా వినియోగించాలని, కానీ ఇతరత్రా అవసరాలకు వినియోగిస్తూ టీటీడీ వాటిని పక్కతోవ పట్టిస్తోందని ఆలయం మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపించారు. పచ్చకర్పూరం, కస్తూరి నుంచి పుష్పాలు, వస్త్రాలు, అలంకరణ, ఉత్సవాలన్నింటికీ దాతలే సాయం చేస్తున్నా ఏ ఒక్క రూపాయి స్వామి సేవకు వెళ్లడం లేదని విమర్శించారు. రోజుకి దాదాపు రూ.2.5 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు స్వామికి విరాళాల రూపంలో అందుతుండగా, వాటిని ఉద్యోగుల అవసరాలకు, ఇంజనీరింగ్ పనులకు, కాంట్రాక్టర్లకు, ధర్మప్రచారానికే పోతున్నాయని చెప్పారు.
భక్తులు స్వామివారి సేవకోసం సమర్పించిన కానుకలను ఇతరత్రా కార్యక్రమాలకు వినియోగించడం భక్తులకు క్షేమదాయకం కాదని రమణ దీక్షితులు అభిప్రాయపడ్డారు. అందువల్ల భక్తులు తిరుమల హుండీల్లో డబ్బు వేయకుండా ధూపదీపాల్లేని ఆలయాల అర్చకుల జీతాలకు, నైవేద్యాలకు విరాళంగా అందజేస్తే పుణ్యం వస్తుందని సూచించారు. విరాళాలను ఏ ఆలయానికి ఇచ్చినా నేరుగా స్వామి వారికే చేరుతాయని చెప్పారు.