telugu navyamedia
రాజకీయ వార్తలు

ట్రంప్ విధించబోయే సుంకాలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యానికి కారణమవుతాయి : ఎలాన్ మస్క్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన దూకుడైన కొత్త వాణిజ్య సుంకాలు ఈ ఏడాది ద్వితీయార్ధంలో దేశాన్ని ఆర్థిక మాంద్యంలోకి నెట్టగలవని టెస్లా, స్పేస్‌ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్ శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన మస్క్, అమెరికా అధ్యక్షుడి మధ్య కొనసాగుతున్న బహిరంగ వివాదం ఈ వ్యాఖ్యలతో మరింత తీవ్రరూపం దాల్చింది.

“ట్రంప్ విధించబోయే సుంకాలు ఈ ఏడాది రెండో అర్ధభాగంలో ఆర్థిక మాంద్యానికి కారణమవుతాయి” అని మస్క్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

“అమెరికా దివాలా తీస్తే, ఇక మిగిలిన విషయాలకు విలువేముంటుంది” అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ ఇద్దరు ప్రముఖుల మధ్య తలెత్తిన విభేదాలు ఆర్థిక మార్కెట్లలో ప్రకంపనలు సృష్టించాయి. గురువారం (అమెరికా కాలమానం ప్రకారం) టెస్లా షేర్లు ఏకంగా 14 శాతానికి పైగా పతనమై, దాదాపు 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను కోల్పోయాయి.

మరోవైపు, ప్రభుత్వం డబ్బు ఆదా చేసుకోవడానికి “సులభమైన మార్గం” బిలియనీర్, మాజీ సలహాదారు అయిన మస్క్‌కు చెందిన కాంట్రాక్టులు, రాయితీలను ‘రద్దు చేయడమే’ అని ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.

ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ కూడా అంతే ఘాటుగా స్పందించారు. “నా ప్రభుత్వ కాంట్రాక్టుల రద్దు గురించి అధ్యక్షుడి ప్రకటన నేపథ్యంలో, స్పేస్‌ఎక్స్ తక్షణమే తన డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ ఉపసంహరణ ప్రక్రియను ప్రారంభిస్తుంది” అని ఆయన బదులిచ్చారు.

గత ఏడాది ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు తాను 250 మిలియన్ డాలర్లకు పైగా విరాళం ఇచ్చి సహాయం చేశానని, అయినప్పటికీ అధ్యక్షుడు ‘కృతజ్ఞత చూపడం లేదని’ మస్క్ ఆరోపించిన తర్వాత ట్రంప్ ఈ బెదిరింపులకు దిగారు.

“నేను లేకపోతే ఆయన ఎన్నికల్లో ఓడిపోయేవారు” అని కూడా మస్క్ పేర్కొన్నారు.

“వారు ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక విషయం గమనించాలి. ట్రంప్‌కు అధ్యక్షుడిగా ఇంకా 3.5 సంవత్సరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి, కానీ నేను 40 ఏళ్లకు పైగా ఇక్కడే ఉంటాను” అంటూ మస్క్ మరో పోస్ట్‌లో వ్యాఖ్యానించారు.

అధ్యక్షుడి కీలకమైన పన్ను కోతలు, వ్యయ ప్రణాళికల బిల్లును మస్క్ తీవ్రంగా విమర్శించిన తర్వాత తాను ఆయనపై “చాలా నిరాశ చెందానని” ట్రంప్ తెలిపారు.

దీనికి మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ప్రతిస్పందిస్తూ “అయితే ఏంటి (వాటెవర్)” అని రాసుకొచ్చారు.

Related posts