ధోనీ ఆడగలడా లేదా అనేది అతడికి తెలుసునని, అందుకే ఎప్పుడు సిద్ధం అయితే అప్పుడు మళ్ళీ బ్యాట్ పట్టుకుంటాడని రవిశాస్త్రి అన్నారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌లో కేఎల్ రాహుల్‌ను కీపింగ్‌కు పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. జట్టు అవసరాలను బట్టి ఆటగాళ్లు ఒకేసారి భిన్న పాత్రాల్లో ఒదిగిపోవాల్సి ఉంటుందని తెలిపారు. రాణించాలంటే రిషభ్ పంత్ ప్రశాంతంగా ఉండాలని ఆయన సూచించారు. ధోనీ విరామం తీసుకోవడం మంచిదే. ఐపీఎల్ సమయానికి అతడు తిరిగి బ్యాటు పట్టుకుంటాడు. వన్డేలపై అతడికి ఆసక్తి ఉందనుకోను. టెస్టు క్రికెట్‌కు ఎప్పుడో వీడ్కోలు పలికాడు. టీ20లే అతడికి అవకాశం. డిమాండ్లకు తగట్టు అతడి శరీరం సహకరిస్తుందో లేదో మహీకే తెలుసు. విశ్రాంతి వల్ల శారీరకంగా, మానసికంగా మెరుగవుతారు. మానసిక అలసట మాయం అవుతుంది. ఆడాలని అతడు నిర్ణయించుకుంటే ఐపీఎల్ ఆడతాడు. ఆ తర్వాత టీమిండియాకు సన్నద్ధం అవుతాడు అని శాస్త్రి అన్నారు.
టీమిండియాకు కేఎల్ రాహుల్ కీపింగ్ చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని శాస్త్రి పరోక్షంగా తెలిపారు. ఇప్పటికే అతడు ఐపీఎల్‌లో పంజాబ్, దేశవాళీలో కర్ణాటకకు కీపింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ‘కచ్చితంగా ఇదో అవకాశం. ఎవరి సామర్థ్యాలేంటో చూడాలి. ఐపీఎల్‌లో అద్భుత ఇన్నింగ్స్‌లు ఆడిన క్రికెటర్లు మిడిలార్డర్‌లో రాణించొచ్చు. ఒకే సారి విభిన్న పాత్రలు పోషించే, టాప్ ఆర్డర్‌లో ఉపయోగపడే ఆటగాళ్లకు అండగా నిలవాలి’ అని రాహుల్ గురించి చెప్పారు. పంత్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పని విలువలు బాగుండాలి. బ్యాటింగ్ ఎలా చేయాలన్నదానిపై స్పష్టత ఉండాలి. తొలి బంతి నుంచే సిక్సర్ బాదాలన్నట్టు ఉండొద్దు. ప్రతిసారీ అది పనిచేయదు. ఆట అన్నీ నేర్పిస్తుంది. పిచ్చితనానికీ ఓ పద్ధతుంది. అతడు దానిని నేర్చుకోవాలి. ప్రశాంతంగా ఉండాలి. తనను తాను మళ్లీ కనుగొనేందుకు దేశవాళీలు ఆడటంలో తప్పులేదు. ఆ స్థాయిలో ఒత్తిడి కాస్త తక్కువ ఉంటుంది. అతడిది చిన్నవయసే కావడం అదృష్టం. 3-6 నెలలు దేశవాళీకి వెళ్లి మెరుగవ్వడంలో తప్పులేదు. అప్పుడు మరింత దృఢంగా తిరిగిరావొచ్చు. బయట మాటలను అతడు పట్టించుకోవద్దు. అతడికి కాస్త సమయం ఇవ్వాలి. ఐదేళ్ల తర్వాతా పంత్ రాణించకపోతే అప్పుడు మాట్లాడాలని రవిశాస్త్రి అన్నారు.