telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట

అక్రమ మైనింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ ఎమ్మెల్యే, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది.

ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు విధించిన ఏడేళ్ల జైలు శిక్షను ఉన్నత న్యాయస్థానం బుధవారం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వివరాల్లోకి వెళితే ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి సంబంధించిన అక్రమ మైనింగ్ కార్యకలాపాల ఆరోపణలపై హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టు మే 5న గాలి జనార్దన్ రెడ్డితో పాటు మరో ముగ్గురిని దోషులుగా నిర్ధారించింది.

వారికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. ఈ తీర్పు నేపథ్యంలో కర్ణాటక శాసనసభ గాలి జనార్దన్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసింది.

సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ గాలి జనార్దన్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తన జైలు శిక్షను సస్పెండ్ చేయాలని, లేకపోతే తన నియోజకవర్గాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తరఫు న్యాయవాది వాదించారు.

ఇప్పటికే తాను మూడున్నర సంవత్సరాలు జైలు జీవితం గడిపానని, ఒకవేళ తన స్థానానికి ఉప ఎన్నికలు జరిగితే తీవ్రంగా నష్టపోతానని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

గాలి జనార్దన్ రెడ్డి తరఫు వాదనలు విన్న హైకోర్టు, ఆయనకు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. రూ.10 లక్షల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది.

అంతేకాకుండా దేశం విడిచి వెళ్లరాదని, తన పాస్‌పోర్టును కోర్టుకు అప్పగించాలని షరతులు విధించింది. తదుపరి విచారణ ప్రక్రియకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ షరతులు విధించినట్లు తెలుస్తోంది.

అయితే, గాలి జనార్దన్ రెడ్డికి శిక్ష సస్పెన్షన్ ఇవ్వడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకించింది. శిక్షను సస్పెండ్ చేసేందుకు ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని, ఆయనపై ఇతర కేసులు కూడా నడుస్తున్నాయని కోర్టుకు తెలిపింది.

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు శిక్షను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Related posts