telugu navyamedia
తెలంగాణ వార్తలు

తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాసరావుకు కరోనా

తెలంగాణలో కరోనా ఉధృతి పెరుగుతోంది. వారం రోజులుగా పెద్ద సంఖ్యలోనే కొవిడ్‌ బారినపడుతున్నారు. ఒమిక్రాన్‌ దెబ్బకు వైద్యసిబ్బంది విలవిల్లాడుతున్నారు. తాజాగా తెలంగాణ డైరెక్టర్​ ఆఫ్​ హెల్త్​ శ్రీనివాస రావుకు కరోనా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలతో ఆస్పత్రితో చేరినట్లు ఆయన వెల్లడించారు.

కొవిడ్‌ నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌, తగిన చికిత్స కోసం ఆసుపత్రిలో చేరుతున్నట్లు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దని… త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని చెప్పారు. కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇటీవల తనను కలిసిన వాళ్లు కరోనా టెస్ట్ చేయించుకోవాలని డీహెచ్‌ శ్రీనివాసరావు సూచించారు. కాగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ కోవిడ్‌ నిబంధనలు పాటించాలని కోరారు.

ఇటీవల రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజా ప్రతినిధులతో పాటు డాక్టర్లు, పోలీసులు, ఇతర సిబ్బంది చాలామందే వైరస్ బారిన పడుతున్నారు.

ఇక తాజాగా గాంధీ ఆసుపత్రిలో 40 మంది పీజీ వైద్యవిద్యార్థులు, 38 మంది హౌజ్‌సర్జన్లు, 35 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులు, ఆరుగురు అధ్యాపక సిబ్బంది మహమ్మారి బారిన పడగా ఉస్మానియాలో 71 మంది పీజీ వైద్యవిద్యార్థులతో పాటు 90 మంది సిబ్బంది, నిమ్స్‌లోనూ 70 మందికి పైగా వైద్యులు కరోనా కోరల్లో చిక్కుకున్నారు.ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో 9 మంది వైద్యసిబ్బందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది.నీలోఫర్‌ ఆస్పత్రిలోనూ 25 మందికి వైరస్ సోకినట్టు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి..

అంతేకాకుండా కొవిడ్‌ సేవల్లో పాల్గొంటున్న వైద్యసిబ్బందికి 7 రోజుల క్వారంటైన్‌ విధానాన్ని తిరిగి ప్రవేశపెడుతూ వైద్యశాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.

Related posts