telugu navyamedia
తెలంగాణ వార్తలు

తనకు గౌరవం ఇవ్వకపోయినా..నా పనిని కొనసాగిస్తా.. వాస్త‌వాలేంటో ప్ర‌జ‌ల‌కు తెలియాలి

*రాజ్‌భ‌వ‌న్ ప్ర‌జాభ‌వ‌న్‌గా మారింది..
*ప్ర‌జ‌లు కోసం రాజ‌భ‌వ‌న్ త‌లుపులు తెరిచాం..
*ఎన్ని అండంకులు వ‌చ్చినా నా ప‌ని కొన‌సాగిస్తా..
*నాకు గౌర‌వం ఇవ్వ‌క‌పోయినా ప‌ని చేస్తూనే ఉంటా..
*నాకు ఎలాంటి వ్య‌క్తిగ‌త ఉద్దేశాలు లేవు..వాస్త‌వాలేంటో ప్ర‌జ‌ల‌కు తెలియాలి.

తెలంగాణ ప్రభుత్వం పైన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి అసంతృప్తికర వ్యాఖ్యలు చేశారు.తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నేడు రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తమిళిసై ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, హోంమంత్రిత్వశాఖకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజల మద్దతు, సహకారం ఇలాగే కొనసాగాలని కోరారు.

త‌న‌కు ప్ర‌భుత్వం గౌర‌వం ఇవ్వ‌క‌పోయినా ..త‌న పని తాను కొనసాగిస్తానని చెప్పారు. తాను రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదురయ్యానన్నారు. వరంగల్ పర్యటనలో తనను అవమానించారన్నారు.

తనకు వ్యక్తిగతంగా గౌరవం అవసరం లేదని, రాజ్ భవన్ ను గౌరవించాలన్నారు. రాజ్ భవన్ ను ప్రజాభవన్ గా మార్చానని, ప్రజల కోసం రాజ్ భవన్ తలుపులు తెరిచినట్లు తమిళ సై పేర్కొన్నారు.

మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లడానికి హెలికాప్టర్ అడిగితే చివరి వరకు సమాధానం చెప్పలేదని.. చివరికి 8 గంటలు కారులో ప్రయాణించి రోడ్డు మార్గంలో వెళ్లాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు.

ఇటీవల 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్ లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహిస్తే అక్కడికి కూడా రాలేదని అన్నారు. రావట్లేదని కనీస సమాచారం కూడా అందించలేదని చెప్పారు.

ఈ వ్యవహారాలన్నీ తనకు ఇష్యూ చేయాలని లేదని, రాష్ట్ర గవర్నర్ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి వాస్తవాలు ఏంటో ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పారు.

తనకు గౌరవం ఇచ్చిన ఇవ్వకపోయినా పట్టించుకోననని.. రాజ్‌భవన్‌ను గౌరవించాలి కదా అని అన్నారు. తనకు ఎలాంటి వ్యక్తిగత ఉద్దేశాలు లేవని చెప్పారు.

గవర్నర్ ఆఫీసును ప్రభుత్వం చులకనగా చూస్తోందని, తీవ్రమైన వివక్ష చూపిస్తోందని విమర్శించారు. ఒక మహిళను అవమానించిన ప్రభుత్వంగా ముద్ర పడకూడదని అన్నారు.

Related posts