telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్‌లో భారీ వర్షాలు: అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం – అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు

భాగ్యనగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు సంబంధింత అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో వర్షాలపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.

లోతట్టు ప్రాంతాలపై ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

ఇప్పటికే జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్,హైడ్రా కమిషనర్, పోలీస్ కమిషనర్, వాటర్‌వర్క్స్, ఇతర అధికారులను అప్రమత్తం చేస్తూ వారితో మాట్లాడామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకొచ్చారు.

ప్రజలు ఆందోళన చెందవద్దని చెప్పారు. హైదరాబాద్ నగరానికి సంబంధించి వర్షపు నీళ్లు ఎక్కడ నిల్వ లేకుండా సిబ్బంది వెంటనే తొలగిస్తున్నారని వెల్లడించారు.

141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌పై అధికారులు సమన్వయం చేస్తున్నారని అన్నారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజలకి ఏమైనా ఇబ్బందులు వస్తే త్వరగా పరిష్కరించడానికి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.

ప్రజలు ధైర్యంగా ఉండాలని.. ఏదైనా విపత్తు వస్తే అధికారులకు వెంటనే సమాచారం అందించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Related posts