telugu navyamedia
సామాజిక

తెలంగాణాలో.. మరోసారి.. భారీగా నకిలీనోట్లు.. ముఠా అరెస్ట్..

తెలంగాణాలో మరోసారి నకిలీనోట్లు భారీగా బయటపడ్డాయి. ఈ సారి సిద్ధిపేట జిల్లా కేంద్రంగా నడుస్తున్న నకిలీ నోట్ల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. నోట్లను ముద్రించి చలామణి చేస్తున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. సిద్ధిపేటకు చెందిన గ్యాదరి బాలకృష్ణ నంగనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అటెండర్. స్నేహితుడు మద్దూరుకు చెందిన చింతల హరినాథ్‌తో కలిసి ఐదు నెలల క్రితం నకిలీ నోట్ల తయారీకి పథకం వేశాడు. అనుకున్నదే తడవుగా, హైదరాబాద్ వెళ్లి కంప్యూటర్, ప్రింటర్, స్కానర్, పేపర్ కట్టలు, రంగులు, పెన్నులు కొనుగోలు చేసి తీసుకొచ్చాడు.

బాలకృష్ణ తన ఇంట్లోనే నకిలీ నోట్లను ముద్రించడం మొదలుపెట్టాడు. మూడున్నర లక్షల రూపాయల విలువైన రూ.200, రూ.500, రూ.2000 నోట్లను తయారుచేసి చలామణి ప్రారంభించాడు. బాలకృష్ణకు సురేశ్‌, పల్లెపు సాయికుమార్‌, సుంకోజి శ్రీశైలం, గిరి గోవర్ధన్‌రెడ్డి, బండి రఘులు సాయం చేశారు. అందరూ కలిసి రూ. 2 లక్షల వరకు నకిలీ నోట్లను చలామణి చేశారు. గత నెల 10న నకిలీ నోట్ల విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు తాజాగా నిందితులు ఏడుగురినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మరో నిందితుడు అశోక్ పరారీలో ఉన్నాడు. వారి నుంచి ప్రింటింగ్ సామగ్రి, రూ.89,200 విలువైన నకిలీ నోట్లు, రూ.1.80 లక్షల విలువైన అసలు నోట్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Related posts