ఒంగోలు వేదికగా మూడేళ్ల తర్వాత టీడీపీ మహానాడు జరుగుతోంది. మహనాడుతో ఒంగోలు మండవవారిపాలెం పసుపుమయంగా మారింది. నేడు, రేపు జరిగే ఈ మహానాడుకు రాష్ట్రం నలుమూలల నుంచి 10 వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మహానాడు సందర్భంగా ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటికే ఒంగోలుకు చేరుకున్నారు.
ఇక చంద్రబాబు అధ్యక్షతన ఒంగోలులో టిడిపి పొలిట్ బ్యూరో సమావేశమయ్యింది. 2024 టార్గెట్ గా.. మహానాడులో ప్రవేశపెట్టే 17 తీర్మానాలకు పొలిట్ బ్యూరో ఆమోదం తెలిపింది. మహానాడు నిర్వహణ పై కూడా పొలిట్ బ్యూరోలో చర్చించారు.

మహానాడులో ఎపికి సంబంధించిన 12 తీర్మానాలు, తెలంగాణకు సంబంధించి 3 తీర్మానాలు, అండమాన్ కు సంబంధించి ఒక తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. వీటితో పాటు రాజకీయ తీర్మానం కూడా ఉంటుంది. ఈ తీర్మానాలపై దాదాపు 50 మంది మాట్లాడే అవకాశం ఉంది. ఆయా తీర్మానాలు ప్రజల్లోకి వెళ్లేలా మహానాడు చర్చలు సాగాలని మహానాడులో నేతలు అభిప్రాయ పడినట్టు తెలుస్తోంది.
కాగా..మహానాడులో జనసేనతో పొత్తు అంశంపై స్పష్టత వచ్చే అవకాశముందని టాక్ వినిపిస్తుంది.చంద్రబాబుసైతం జనసేనతో జట్టుకట్టేందుకు సుముఖంగానే ఉన్నారు.
మరి బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో.. బీజేపీతో ఎటువంటి వైఖరి అవలంభిస్తారో కూడా మహానాడు వేదికగా స్పష్టత వచ్చే అవకాశం ముందని తెలుస్తోంది.

