మాజీ ముఖ్యమంత్రి జగన్ కు రాష్ట్రంలో వైద్య కళాశాలలు నిర్మించడం ఇష్టం లేదని, అందుకే కూటమి ప్రభుత్వం పిలుస్తున్న టెండర్ల ప్రక్రియను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తీవ్ర ఆరోపణలు చేశారు.
కాంట్రాక్టర్లు ఎవరూ టెండర్లలో పాల్గొనవద్దని జగన్ హెచ్చరికలు జారీ చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ హయాంలో నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిన వైద్య కళాశాల స్థలాన్ని, పక్కన పడేసిన ఎంఐజీ లేఅవుట్‌ను ఆమె పార్టీ శ్రేణులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, తమ హయాంలో 17 వైద్య కళాశాలలు నిర్మించామని జగన్ తన అనుకూల మీడియాలో ప్రచారం చేయించుకోవడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.
ఈ అబద్ధాలను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
ఇటీవల కూటమి ప్రభుత్వం నిర్వహించిన ‘సూపర్‌సిక్స్-సూపర్‌హిట్’ సభ విజయవంతం కావడాన్ని ఓర్వలేకే జగన్ విషం కక్కుతున్నారని విమర్శించారు.
గతంలో ఎంతో ఆర్భాటంగా 17 వైద్య కళాశాలలకు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేసి, వాటన్నింటినీ రెండేళ్లలో పూర్తి చేస్తామని జగన్ గొప్పలు చెప్పారని మంత్రి గుర్తుచేశారు.
కానీ, ఐదేళ్ల పాలనలో ఒక్క కళాశాల నిర్మాణాన్ని కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
వైకాపా నాయకులకు కూల్చడం మాత్రమే తెలుసని, నిర్మాణాలు చేయడం చేతకాదని ఆమె తీవ్రస్థాయిలో విమర్శించారు.


దోపిడీదారులు నిప్పు కణికల్లా బిల్డప్ ఇస్తుంటారు: విజయసాయిరెడ్డి