telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వం – సోము వీర్రాజు

ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర‌ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యమానికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన తెలిపారు. పీఆర్సీ జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అద్దెలు పెరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల హెచ్ఆర్‌ను ప్రభుత్వం ఎలా తగ్గిస్తుందని సోము వీర్రాజు ప్రశ్నించారు.

కర్నూలులో పర్యటించిన సోము వీర్రాజు జగన్ సర్కార్ పై విమర్శలు గుప్పించారు….సీఎంగా జగన్ ప‌ద‌వి చేపట్టినప్పటి నుంచి ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారని సోము వీర్రాజు అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను తన పథకాలుగా చెప్పుకుంటూ.. సీఎం జ‌గ‌న్ ఫోటోల‌కు పోజులు ఇస్తున్నారని ఆరోపించారు. సమస్యలపై జ‌నం ప్రశ్నిస్తే దాడులు చేసి వారిపైనే కేసులు పెడుతున్నారని దుయ్యబట్టారు.

విజయనగరం, రామతీర్థం ఘటనల్లో ఇంత వరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయలేదన్నారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం చేస్తే వెంటనే అరెస్టు చేశారని.. రాముని విగ్రహం ధ్వంసం చేస్తే నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రభుత్వాన్ని నిలదీశారు.

బీజేపీ మతతత్వ పార్టీ అని ఆరోపణలు చేస్తున్న వైసీపీ నేతలు.. రాష్ట్ర ప్రభుత్వ డబ్బులతో మసీదులు, చర్చీలకు నిధులను కేటాయిస్తోందన్నారు. ముస్లింలకు స్టేషన్ బెయిల్ ఇస్తే.. హిందువు అయిన బీజేపీ కార్యకర్తను మాత్రం రిమాండ్‌కు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వం మతతత్వ ప్రభుత్వమని చెప్పొచ్చని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. హిందూ వ్యతిరేక విధానాలతో వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శలు చేశారు.

ప్రజలను భయపెడితే ఎంతో కాలం అధికారంలో ఉండరని హెచ్చరించారు. వైసీపీకి ఓటు వేయకపోతే .. సంక్షేమ పథకాలు నిలిపేస్తామని వాలంటీర్లతో ప్రజలను బెదిరించడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తామని, మూడేళ్లలోనే అమరావతిని నిర్మిస్తామని చెప్పారు . అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులు ఉండవు.. రాష్ట్ర రాజధానిగా అమరావతియే ఉంటుందని పేర్కొన్నారు.

Image

మ‌రోవైపు ఆత్మకూరు సంఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడన్న కారణంతో అరెస్టు చేసిన బిజెపి నంద్యాల పార్లమెంటు జిల్లా కోశాధికారి సజ్జన్ సింగ్ పురోహిత్ ఇంటికి సోము వీర్రాజు వెళ్ళారు. వారి కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఇలాంటి అన్యాయాలను బిజెపి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు.

Related posts