telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మా భూములు మాకు ఇవ్వండి.. ఆర్కే ను కలిసిన ఉండవల్లి రైతులు..

mangalagiri mla alla on prajavedika demolition

నేడు ఉండవల్లి రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ను కలిశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం గతంలో తీసుకున్న భూములను తమకు తిరిగి ఇప్పించాలని వారు కోరారు. ఈ సందర్భంగా రైతు దాసరి సాంబశివరావు మాట్లాడుతూ, చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఆయన నివాసం ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ నుంచి రోడ్డు నిర్మాణం కోసం పది అడుగుల భూమిని తీసుకున్నారని చెప్పారు. సీఎం శాశ్వత నివాసం కట్టుకున్న తర్వాత షరతుల ప్రకారం ఆ భూమిని పొలంలో కలిపేస్తామంటూ ఈ మేరకు అప్పటి ఆర్టీవో, ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి సంతకం చేసి ఓ పత్రాన్ని ఇచ్చారని అన్నారు. ఆ పత్రంలో పది అడుగులు కాకుండా 23 అడుగులు తీసుకున్నట్టు ఉందని ఆరోపించారు.

అధికారుల నుంచి తనకు ఎలాంటి సమాధానం రాలేదని రైతులు చెప్పారు. సీఎం పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారు కనుక, ఒప్పందం ప్రకారం తన భూమి తనకు ఇచ్చివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఆర్డీఏ అధికారులు, జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించనున్నట్టు తెలిపారు. మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ, చంద్రబాబు నివాసం వద్ద తనకు 20 సెంట్ల భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించే వాడినని చెప్పారు. చంద్రబాబు నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం తన భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, తిరిగి తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న భూమిని రైతులతో కలిసి ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ, తమది రాజన్న ప్రభుత్వమని, భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని రైతులకు స్పష్టం గా చెప్పారు.

Related posts