బీజేపీ-శివసేనల మధ్య అధికార పంపిణీ వ్యవహారం జఠిలంగా మారుతోంది. అధికార కాలాన్ని సమానంగా పంచుకోవాలన్న ఫార్మూలాపై బీజేపీ నాయకత్వం తమకు లిఖితపూర్వక హామీ ఇవ్వాలని శివసేన నాయకత్వం డిమాండ్ చేసింది. ఈ హామీ ఇస్తేనే సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తదుపరి చర్చలకు ముందుకు వస్తామని తేల్చి చెప్పింది. శివసేన తరఫున ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు శనివారం ముంబయిలో పార్టీ అధినేత థాక్రేను కలుసుకుని చర్చలు జరిపారు. ఠాక్రే కుమారుడు ఆదిత్య థాక్రేను కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా నియమించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి తనకు ఇతరత్రా ఎన్నో మార్గాలు ఉన్నాయని, అయితే బీజేపీకి తమకు మధ్య హిందుత్వ సిద్ధాంతానికి సంబంధించిన అనుబంధం ఉంది కాబట్టి వాటిని తాము పరిగణలోకి తీసుకోవడం లేదని ఈ సమావేశంలో థాక్రే అన్నట్లుగా ఓ ఎమ్మెల్యే తెలిపారు.
కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై తగిన నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ఉద్దవ్ థాక్రేకు అప్పగించినట్లుగా ఆయన వెల్లడించారు. గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఈ సారి బీజేపీకి 17 సీట్లు తక్కువ రావడం అధికారం కోసం శివసేన తన డిమాండ్ల తీవ్రతను పెంచడానికి ఆస్కారం ఇచ్చింది. దీని దృష్ట్యానే అధికార పంపిణీకి సంబంధించి బీజేపీని ఏకంగా లిఖితపూర్వక హామీ కోసం డిమాండ్ చేస్తోంది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు అమిత్ షా సమక్షంలోనే అదీ థాక్రే ఇంట్లోనే రెండు పార్టీల మధ్య ఒప్పందం కుదిరిన విషయాన్ని థాక్రే ఈ సమావేశంలో గుర్తు చేశారని ఆయన చెప్పారు. ఈ లిఖితపూర్వక హామీని బీజేపీ అందించే వరకూ ప్రభుత్వ ఏర్పాటుపై తాము ముందుకు వెళ్ళేది లేదని కూడా ఈ సమావేశంలో ఉద్దవ్ థాక్రే స్పష్టం చేసినట్లు సేన ఎమ్మెల్యే ప్రతాప్ సమాయిత్ తెలిపారు. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాతే శివసేన శాసనసభాపక్షం నాయకుని ఎన్నిక కూడా జరుగుతుందని ఈ సమావేశంలో థాక్రే వెల్లడించినట్లు చెప్పారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్‌సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 సీట్లు వచ్చాయి. ఎన్నికల్లో పూర్తి మెజారిటీ తమదేనని ఘంటాపథంగా చెప్పిన బీజేపీకి ఈ ఫలితాలు దిగ్భ్రాంతినే కలిగించాయి. ఓటర్ల అస్పష్టత తీర్పుతో మారిన రాజకీయ వాతావరణం శివసేనకు అన్ని విధాలా కలిసి వచ్చింది.