ఇప్పటి సంగీత దర్శకులకు కొత్త సంగీతం అందించే టాలెంట్ లేకపోవడం వల్లే తన సినిమా పాటలను వాడుకుంటున్నారని దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా విమర్శించినా విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల తమిళనాడులో విడుదలై సంచలన విజయం సాధించిన “96” సినిమాలో తన పాటలను వాడుకోవడం పట్ల ఇళయరాజా ఫైర్ అయ్యారు. 80, 90 కాలానికి సంబంధించిన కథతో “96′ సినిమా తెరకెక్కింది. దీంతో ఆయా కాలానికి తగ్గట్టు ఇళయారాజా పాటలను ఈ సినిమాలో వాడుకున్నారు. ఇళయరాజా వ్యాఖ్యలపై తాజాగా దర్శకుడు శీను రామస్వామి స్పందించారు. “ఇళయరాజా పాటలు ప్రజల గుండెల్లో ఇప్పటికీ పదిలమే. ఆయన పాటలు లేకుండా సినిమాల్లో 80, 90ల కాలం నాటి సన్నివేశాలను చూపించలేం. ఇటీవల విడుదలై బ్లాక్బస్టర్ అయిన “96” సినిమాను ఆయన చూసుంటే కచ్చితంగా నచ్చి ఉండేది” అంటూ ఆయన ట్వీట్ చేశారు.

