telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు వార్తలు

రైతులకు తీపికబురు: ధాన్యం బకాయిలకు రూ.672 కోట్లు విడుదలకు చంద్రబాబు కేబినెట్ నిర్ణయం

సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ బుధవారం వెలగపూడిలోని సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైతాంగానికి కేబినెట్ తీపి కబురు చెప్పింది.

ధాన్యం పాత బకాయిలు రూ.1000 కోట్లలో రూ. 672 కోట్ల నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నగదును 24 గంటల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ నిధులు రైతుల ఖాతాల్లో వేసే బాధ్యతను పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌కి ప్రభుత్వం అప్పగించింది. అందుకోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

ప్రజా పంపిణీ అవసరాల కోసం పౌరసరఫరాల సంస్థ ద్వారా గత రబీ సీజన్‌లో ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది.

ఆ క్రమంలో మద్దతు ధరను రైతుల ఖాతాల్లో జమ చేయడంలో జాప్యం జరిగింది. దీంతో రైతులు ఆందోళన చెందారు.

ఈ నేపథ్యంలో జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌సీడీసీ) నుంచి ఏపీ మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1,000 కోట్లు రుణం తీసుకోవడానికి అనుమతిస్తూ జులై 4వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నిధులు వచ్చిన వెంటనే ధాన్యం బకాయిలను రైతుల ఖాతాల్లో జమ చేసేలా పౌరసరఫరాల సంస్థ అధికారులు చర్యలు చేపట్టనున్నారు.

దీంతో ఈ వారంలోనే రైతుల ఖాతాల్లో ఈ ధాన్యం బకాయిల సొమ్ము జమ కానుందని తెలుస్తుంది. మరోవైపు ఈ రోజు ఉదయం రాజధాని అమరావతిలో కేబినెట్ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది.

Related posts