telugu navyamedia
ఆంధ్ర వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణం: ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి

రామోజీ గ్రూపు సంస్థలు తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి గర్వకారణంగా నిలుస్తున్నాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్ నగరంలో చార్మినార్, గోల్కొండ, హైటెక్ సిటీ వరుసలో నాలుగవ అద్బుతంగా రామోజీ ఫిల్మ్ సిటీ గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు.

పత్రికా రంగంలో తనదైన ముద్ర వేసిన రామోజీ రావు గారు ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రోత్సహించిన రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారిని గుర్తించి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించింది.

రామోజీ రావు గారి 89 వ జయంతిని పురస్కరించుకుని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ అవార్డుల బహూకరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉప రాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్ గారు పాల్గొన్నారు.

వారితో పాటు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ నాయుడు గారు పాల్గొన్నారు.

బండి సంజయ్ గారు, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ గారు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ, రామోజీ రావు గారు ఏ విలువలు, సంప్రదాయాలను తెలుగు ప్రజలకు అందించారో ఆ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ఎక్సలెన్స్ అవార్డులను అందించడం అభినందనీయమని అన్నారు.

తెలుగు చలనచిత్ర రంగం నంది అవార్డుల నుంచి ఆస్కార్ అవార్డుల వరకు ఎదగడంలో రామోజీ ఫిల్మ్ సిటీ ఎంతో తోడ్పాటును అందించిందని అన్నారు.

టాలీవుడ్, బాలీవుడ్ కాకుండా హాలీవుడ్ సహా స్క్రిప్ట్ తో రామోజీ ఫిల్మ్ సిటీలోకి ప్రవేశిస్తే ప్రింట్ తీసుకుని వెళ్లొచ్చేలా అద్భుతమైన కళాఖండాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.

రామోజీ రావు గారు ఏ రంగంలో ప్రవేశించినా అందులో తనదైన ముద్ర వేశారని చెప్పారు.

వయసు పైబడినప్పటికీ నిత్యం పనిలోనే సంతృప్తి ఉంటుందని చెప్పేవారని, రామోజీ రావు గారు ఒక నిబద్ధతతో పనిచేశారని కొనియాడారు.

రామోజీ ఒక పేరు కాదని, అదొక బ్రాండ్ అని ఆ బ్రాండ్ ను కొనసాగించే విషయంలో గ్రూపు సంస్థలకు ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పారు.

రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి కొన్ని చర్యలు తీసుకున్నామని, కొంత సమయం పట్టినప్పటికీ తెలుగు భాషలో పరిపాలనా వ్యవహారాలను కొనసాగించే విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఏడుగురు ప్రముఖులకు ఈ సందర్భంగా రామోజీ పేరిట స్థాపించిన ఎక్సలెన్స్ అవార్డులను బహూకరించారు.

ఈ కార్యక్రమంలో రామోజీ గ్రూపు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గారు, మార్గదర్శి మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ గారు, రామోజీ ఫిల్మ్ సిటీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ విజయేశ్వరి గారితో పాటు సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts