telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

తెలంగాణ ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో పిటిషన్

Telangana Inter results petition High court

తెలంగాణ ఇంటర్మిడియట్ ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఇంటర్ విద్యార్థుల మార్కుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ తప్పిదం చోటుచేసుకుందనీ, కాబట్టి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరింది. అలాగే కొత్త ఏజెన్సీకి ఈ బాధ్యతలను అప్పగించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో ధర్మాసనానికి విన్నవించింది. ఈ మేరకు బాలల హక్కుల సంఘం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మధ్యాహ్నం తర్వాత విచారిస్తామని స్పష్టం చేసింది. తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చాలామంది విద్యార్థుల మార్కులు గోల్ మాల్ అయిన సంగతి తెలిసిందే. తొలి ఏడాది టాపర్లుగా నిలిచిన విద్యార్థులు రెండో ఏడాది ఫెయిల్ అయిన ఘటనలు చాలా బయటకు వచ్చాయి. ఈ నేపథ్యంలో మనస్తాపంతో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు  పాల్పడ్డారు.

ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు ముట్టడికి విద్యార్థులు ఈరోజు పిలుపునివ్వడంతో పోలీసులు భారీగా మోహరించారు. రీ-వెరిఫీకేషన్ కోసం అప్లై చేసుకుందామంటే వెబ్‌సైట్ ఓపెన్ కావడంలేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు న్యాయం చేయాలంటూ అక్కడకు చేరుకున్నారు.

Related posts