telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీకి నాకు మధ్య పోటీ లేదు…

ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ను అద్భుతంగా నడిపించి సారథిగా అజింక్యా రహానే అందరిచేతా శెభాష్‌ అనిపించుకున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో అతన్నే కెప్టెన్‌ చేయాలనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. ఒకరిద్దరూ మాజీ క్రికెటర్లు కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో రహానేనే సారథిగా కొనసాగించాలని కూడా సూచించారు. కానీ తమ జట్టు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమేనని రహానే స్పష్టం చేశాడు. అవసరమైన సందర్భాల్లో మాత్రమే తాను బాధ్యతలు తీసుకుంటానన్నాడు. ఇంగ్లండ్‌తో సిరీస్‌కు కోహ్లీ కెప్టెన్‌గా, నేను వైస్‌ కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తించబోతున్నాం. ఈ హోదాలు మారడం వల్ల జట్టులో ఎలాంటి మార్పు రాదు. ఎప్పటికీ విరాటే మా టీమ్‌ కెప్టెన్‌. నేను అతడికి డిప్యూటీని మాత్రమే. అతను లేనప్పుడు జట్టుకు నాయకత్వం వహించడం, నా అత్యుత్తమ ప్రదర్శనతో టీమ్‌ గెలిచేలా చేయడమే నా బాధ్యత. నేను అదే పని చేశాను.’ అని రహానే వ్యాఖ్యానించాడు. జట్టులో హోదాకంటే అప్పజెప్పిన పనిని ఎంత బాగా చేశామనేదే ముఖ్యమని రహానే తెలిపాడు. ‘పేరుకు కెప్టెన్‌ అని ఉంటే సరిపోదు. నాయకుడిగా నువ్వు ఎంత సమర్థంగా వ్యవహరిస్తావనేది కీలకం. ఇప్పటి వరకు నేను మంచి ఫలితాలే సాధించాను. ఇక ముందు కూడా సాధిస్తా. జట్టుకు ఇలాంటి విజయాలు అందించేందుకు ఇంకా ప్రయత్నిస్తా. కెప్టెన్సీ విషయంలో ఎవరికి వారు ప్రత్యేకం. సరిగ్గా చెప్పాలంటే జట్టు బాగుంటేనే కెప్టెన్‌ కూడా గొప్పగా కనిపిస్తాడు. మ్యాచ్‌లు లేదా సిరీస్‌ గెలవడం అనేది ఏ ఒక్కరివల్లో కాకుండా సమష్టి కృషి ఫలితం. కాబట్టి మీ జట్టు మిమ్మల్ని గొప్ప నాయకుడిగా మారుస్తుంది. తాజా సిరీస్‌ విజయం నా జట్టు సాధించిందే’ అని రహానే పేర్కొన్నాడు.

కోహ్లీతో తన వ్యక్తిగత సంబంధాల విషయంలో ఎప్పుడూ ఎలాంటి ఢోకా లేదని రహానే స్పష్టం చేశాడు. ‘నాకూ, కోహ్లీకి మధ్య మంచి అనుబంధం ఉంది. ఎన్నోసార్లు అతను నా బ్యాటింగ్‌ను ప్రశంసించాడు. ఇద్దరం కలిసి విదేశాల్లో జట్టు కోసం పలు చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు ఆడాం. అతను నాలుగో స్థానంలో, నేను ఐదో స్థానంలో ఆడటం వల్ల పలు మంచి భాగస్వామ్యాలు నమోదదు చేశాం. ఒకరి ఆటపై మరొకరు పరస్పరం నమ్మకం ఉంచాం. విరాట్‌ చురుకైన నాయకుడు. మైదానంలో వేగంగా సరైన నిర్ణయాలు తీసుకోగలడు. ముఖ్యంగా స్పిన్నర్లు బౌలింగ్‌ చేసేటప్పుడు స్లిప్‌లో నేను చక్కటి క్యాచ్‌లు అందుకోగలనని నన్ను గట్టిగా నమ్ముతాడు.నా నుంచి అతను ఎంతో ఆశిస్తాడు. నేను కూడా సాధ్యమైనంత వరకు కోహ్లీ నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తాను’ అని రహానే చెప్పుకొచ్చాడు..

Related posts