telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న అమరావతిలో బహిరంగ సభ

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా జూన్ 12న అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు.

‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్ అధికారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అమరావతి సచివాలయం భవనం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు.

గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో నిర్వహించే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని, ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు.

అదే విధంగా, రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు, ప్రణాళికలు, నాలుగేళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే విషయాలను ఈ వేదిక ద్వారా తెలియజేసే అవకాశం ఉంది.

రాబోయే నాలుగేళ్ల పాలనకు సంబంధించి ఇప్పటికే ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నద్ధమయ్యారు.

Related posts