బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్-విక్కీ కౌశల్‌ను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తిని తాజాగా ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు.
నిందితుడిని మన్వీందర్ సింగ్‌గా గుర్తించారు. కాగా ఇతను కూడా సినిమా రంగంలో అవకాశాల కోసం వెతుకుతున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది. మన్వీందర్ సింగ్‌కు కత్రినా వీరాభిమాని. ఆమెను పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడట. అయితే గతేడాది కత్రినా విక్కీతో పెళ్లిపీటలెక్కడంతో అతను నిరాశకు లోనయ్యాడు.
ఈ నేపథ్యంలో కత్రినా దంపతులను చంపేస్తామంటూ సోషల్ మీడియా వేదికగా గత కొన్ని నెలలుగా బెదిరిస్తున్నాడు. అయితే ఈ బెదిరింపులు మరీ ఎక్కువ కావడంతో కత్రినా దంపతులు పోలీసులను ఆశ్రయించారు.
వారి ఫిర్యాదు మేరకు సెక్షన్ 506(2) (నేరపూరిత బెదిరింపు), 354(డి) (స్టాకింగ్) ఐపీసీ సెక్షన్ 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు అనుమానితుడిగా ఉన్న మన్వీందర్ సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కాగా నిందితుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినాతో పాటు ఇతర బాలీవుడ్ హీరోయిన్ల ఎడిటెడ్ ఫొటోలు, వీడియోలు ఉండడం గమనార్హం. అందులో కత్రినాతో తనకు వివాహమైనట్లు ఇద్దరి ఫొటోలను ఎడిట్ చేసి ఓ వీడియోను కూడా షేర్ చేశాడు.
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కత్రినా ‘టైగర్ 3’ సినిమాలో నటిస్తోంది. మరోపక్క విక్కీ కౌశల్.. ‘గోవిందా నామ్ మేరా’, ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘డుంకీ’ సినిమాల్లో నటిస్తున్నారు.