telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ఎంపీ రాఘురామరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు..

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.

ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ పై దాడి చేసిన కేసులో రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్‌‌తో పాటు ఆయన పీఏ శాస్త్రి, ఇద్దరు సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిపైనా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. A1గా రఘురామరాజు, A2గా భరత్, A3 సందీప్‌(సీఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్), A4 ఏఎస్సై(సీఆర్పీఎఫ్‌), A5 శాస్త్రి పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు.

మోదీ ఏపీ పర్యటన సందర్భంగా రఘురామరాజు జులై 3న సాయంత్రం నర్సాపురం ఎక్స్‌ప్రెస్‌లో భీమవరం వెళ్లేందుకు ప్రయత్నించారు. లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన రఘురామరాజు.. బేగంపేటలో దిగిపోయారు. అనంతరం ఆయన గచ్చిబౌలిలోని ఇంటికి వెళ్లారు

ఈ క్ర‌మంలో జూలై 4 ఆదివారం ఉదయం హైదరాబాద్‌ గచ్చిబౌలి బౌల్డర్‌ హిల్స్‌లో రఘురామ ఇంటి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా ఇంట్లోకి చొర‌బ‌డి ప్రయత్నించాడు. సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా ఇది గమనించిన ఎంపీ భద్రతా సిబ్బంది, ఆయన అనుచరులు అతడిని పట్టుకొన్నారు.

వారు ప్రశ్నించినప్పుడు పొంతనలేని సమాధానాలిచ్చాడు. ఐడీ, ఆధార్‌కార్డులు తీసుకుని ఆరా తీస్తే ఏపీకి చెందిన ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ పీసీ బాషాగా తేలిందని రఘురామ చెప్పారు

అనంతరం గచ్చిబౌలి పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ఆరా తీస్తే 12 మంది వ్యక్తులు రెండు కార్లలో వచ్చి తన ఇంటి వద్ద కాపు కాశారని… తన వాహనాన్ని వెంబడించారని పోలీస్ అధికారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

మరో వైపు విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్‌హిల్స్‌ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని ఇంట్లోకి తీసుకెళ్లారని, చిత్రహింసలకు గురి చేశారని ఏపీ ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ ఎస్‌కే ఫరూక్‌ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని పేర్కొన్నారు. ఇరువైపులా వచ్చిన ఫిర్యాదులు తీసుకొని విచారణ చేపట్టామని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ సురేష్‌ వెల్లడించారు. ఈమేరకు ఎంపీ రఘురామతో పాటు మరో నలుగురిపై కేసు నమోదైంది.

Related posts