జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ ఏనాడూ మోదీ, చంద్రబాబులను ప్రశ్నించలేదని దుయ్యబట్టారు. తనకు అధికారం లేకపోయిన ప్రజలకు మేలు చేసే ఎన్నో పనులు చేస్తున్నానని నాడు పవన్ మాట్లాడారని, ఇప్పుడు కూడా ఆయన అధికారంలో లేరు కనుక ప్రజలకు మేలు చేసే పనులు ఎంత మేరకు చేశారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో జగన్ పరిపాలన బాగుంటే తాను సినిమాలు చేసుకుంటానని పవన్ కల్యాణ్ నాడు వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. జగన్ పాలనకు పవన్ కితాబిస్తూ ఏకంగా ఐదు సినిమాల్లో నటిస్తున్నారని సెటైర్లు విసిరారు. పవన్ సినిమాలు చేసుకోకుండా మళ్లీ ఈ గోల ఏంటి? ఈ ప్యాకేజీ ఏంటి? ఉమ్మడి మేనిఫెస్టో ఏంటి? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. అక్కడ ప్రొడ్యూసర్లకు కాల్షీట్స్ ఇస్తే, ఇక్కడ మోదీ, అమిత్ షా, చంద్రబాబులకు పవన్ కాల్షీట్స్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు.