telugu navyamedia
తెలంగాణ వార్తలు

పువ్వాడను కుల బహిష్కరణ చేయండి.. -రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు

మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌పై పీసీసీ చీఫ్​ రేవంత్‌ రెడ్డి తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. ఖమ్మం జిల్లాలో నమోదైన పీడీ యాక్ట్‌ కేసులు, చనిపోయిన కార్యకర్తలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే సీబీఐ విచారణకు నువ్వు లేఖ రాయి అంటూ మంత్రికి సవాల్‌ విసిరారు.

కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు.. అలాంటి సైకోకు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే మాడి మసైపోతావ్‌ అంటూ హెచ్చరించారు రేవంత్‌రెడ్డి.. కమ్మ కులాన్ని అడ్డం పెట్టుకొని అజయ్‌ బతుకుతున్నాడు.. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల నుండి బయటికి గెంటాలి.. వచ్చే ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ని బహిష్కరించండి అంటూ పిలుపునిచ్చారు.

కేసీఆర్ జీతగాళ్లలాగా పనిచేస్తూ .. కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న అధికారుల పేర్లను డైరీలో నమోదు చేస్తున్నామని.. వారందరికీ వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు.

ఒకవేళ అధికారులు రిటైర్ అయిపోయినా మిమ్మల్ని పట్టుకొచ్చి.. శిక్ష విధిస్తామని రేవంత్ అన్నారు. కేసీఆర్ అంతానికి.. పువ్వాడ పతనానికి సమయం దగ్గరపడిందని ఆయన జోస్యం చెప్పారు.

ఇక, చనిపోయిన రైతు కుంటుంబాలకు కాంగెస్ పార్టీ అండంగా ఉంటుందన్న రేవంత్‌రెడ్డి.. రైతులు పండించిన మిర్చికి గిట్టుబాటు ధరలేక పోతే రైతులకు బేడీలు వేయించిన ఘనత కేసీఆర్‌ది అని మండిపడ్డారు..

మే 6న వరంగల్‌లో రాహుల్ గాంధీ సభ జరుగుతోంది.. కేసీఆర్‌ చేసిన మోసంపై పోరాటానికి రైతు సంఘర్షణ సభ నిర్వహిస్తున్నామని.. పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.

అయితే ..ఖమ్మం పట్టణంలోనూ స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. రేవంత్‌రెడ్డి రాక సందర్భంగా జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నగరపాలక సిబ్బంది వాటిని తొలగించటంతో…. పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు.

ఆవేశంలో కొందరు కార్యకర్తలు అధికారుల వాహనాలపై దాడి చేయడంతో.. అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం రోడ్డుపై బైఠాయించిన కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి. 

మరోవైపు రేవంత్ రెడ్డి రేపటి నల్గొండ పర్యటనను వాయిదా వేసుకున్నారు.ముందుగా ప్రకటించిన ప్రకారం.. ఆయన బుధవారం నల్గొండ జిల్లాలో పర్యటించాల్సి ఉంది. అయితే రేవంత్ పర్యటన వాయిదా పడినట్టుగా నల్గొండ డీసీసీ తెలిపింది

 

 

Related posts