telugu navyamedia
తెలంగాణ వార్తలు

కొందరు మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారు – కేసీఆర్

కొందరు మతం, కులం పేరుతో చిల్లర రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పరోక్షంగా బీజేపీని విమర్శించారు. మతతత్వం క్యాన్సర్ జబ్బులాంటిదని, ఇక్కసారి వస్తే చాలా ప్రమాదకరమని చెప్పారు. అన్ని కులాలు, మతాలను ఆదరించే పరిస్థితిని చెడగొడితే ఎటూ కాకుండా పోతామని వ్యాఖ్యానించారు. కులమతాల పేరుతో రాజకీయాలు చేసే వారిని ప్రజలు గమనించాలని సీఎం కేసీఆర్ సూచించారు.

హైదరాబాద్ లో మూడు టిమ్స్ ఆస్పత్రుల శంకుస్థాపన నేపథ్యంలో ఆల్వాల్ లో మంగళవారం జరిగిన బహిరంగ సభలో సభలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు..అన్ని మతాలు, కులాలను ఆదరించే దేశం మనదని అన్నారు. శాంతి ఉంటేనే మనకు పెట్టుబడులు వస్తాయని తెలిపారు. 

 ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా హైదరాబాద్‌లో 14వేల ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామన్న కేసీఆర్.. ప్రపంచానికే వ్యాక్సిన్ల రాజధానిగా హైదరాబాద్‌ నిలిచిందని తెలిపారు. దేశవిదేశాల వాళ్లు ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. హైదరాబాద్‌లో ప్రశాంతమైన వాతావరణం లేకపోతే పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయా? అని ప్రశ్నించారు.

హైదరాబాద్‌లో 144 సెక్షన్ ఉంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? అని ప్రశ్నించారు. దేశంలో కరెంట్ ఉంటే వార్తా.. తెలంగాణలో కరెంట్ పోతే వార్తా అన్నారు. గుజరాత్‌లో కూడా కరెంట్ కోసం ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. 24 గంటల విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. అన్ని రంగాల్లో తెలంగాణను ముందుకు తీసుకెళ్తున్నామన్నారు.

తెలంగాణలో పేదరికం కారణంగా ప్రజలు వైద్యానికి దూరం కాకూడదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో కొత్తగా మూడు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు అందుబాటులోకి రాబోతున్నట్లు చెప్పారు. ఈ ఆస్పత్రుల్లో ఎయిమ్స్ తరహా సేవలు అందుతాయని స్పష్టం చేశారు.హైదరాబాద్ నలుమూలలా వైద్య సేవలు ఉచితంగా అందుతాయన్నారు.

 హైదరాబాద్‌ పరిధిలో మూడు టిమ్స్‌ ఆస్పత్రులకు కేసీఆర్‌ భూమిపూజ నిర్వహించారు. ఎల్బీనగర్‌ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌), సనత్‌నగర్‌ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), అల్వాల్‌ (బొల్లారం)లో నూతనంగా నిర్మించనున్న టిమ్స్‌ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అల్వాల్‌లో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు.

తెలంగాణలో మిగతా పార్టీలు రాజకీయ సభలు జరుపుకొంటుంటే, మనం మాత్రం ఆరోగ్యానికి సంబంధించిన సభ పెట్టుకున్నామని, ఇదే వాళ్లకీ మనకీ తేడాఅని సీఎం అన్నారు. రాష్ట్రంలో వైద్యవిధానాన్ని పటిష్ఠం చేస్తున్నామని, దీనిలో భాగంగానే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు.

తెలంగాణలో విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో గురుకుల పాఠశాలలను పెంచుతామని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

Related posts